Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 70 గేట్లను అధికారులను పూర్తిగా ఎత్తివేశారు. సముద్రంలోకి 4,06,490 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువలకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,06,990 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ నీటిమట్టం 12.2 అడుగుల మేర ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరకట్ట పొడవునా రీటైనింగ్ వాల్ కారణంగా యనమలకుదురు వరకూ ప్రమాదం తప్పింది. యనమలకుదురు తర్వాత పొలాల వెంబడి కృష్ణానది ప్రవహిస్తోంది. పొలాలలోకి వెళ్లొద్దని రైతాంగాన్ని అధికారులు హెచ్చరించారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఇంకా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. రెవెన్యూ, పోలీసు, రక్షణ యంత్రాంగంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరకట్ట వెంబడి ఉన్న గ్రామాలలో ముంపుకు గురయ్యే ప్రాంతాల వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నదీ పరీవాహక ప్రాంతంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణా తీరం వెంబడి ఉమ్మడి కృష్ణాజిల్లాలో రక్షణ చర్యలు ముమ్మరం చేశారు. రేపు ఉదయానికి మరింతగా వరద పెరిగే అవకాశం ఉంది. పాములలంక, తోడేలు దిబ్బలంక, పొట్టిలంక, పిల్లిలంక గ్రామాల ప్రజలను ముందుగానే అధికారులను హెచ్చరించారు. పశుగ్రాసం కోసం వరి పొలాలనే వినియోగించాలని అధికారులు సూచించారు. గొర్రెలు, మేకలు వంటి వాటిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంఆర్ఓ కార్యాలయాల వద్దే వీఆర్ఓ, వీఆర్ఏలు ఉన్నారు. ప్రతీ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రవాహ వేగం పెరిగే అవకాశం ఉండటంతో బోట్లను బయటకు తీయద్దని అధికారులు హెచ్చరించారు. లంక గ్రామాల ప్రజలను ప్రతీక్షణం గమనిస్తున్నామని అధికారులు తెలిపారు. కృష్ణా తీరం వెంబడి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
