Konaseema: తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఎన్నికల్లో ఇద్దరూ గెలుపు..

Konaseema Mptc Elections Father

Konaseema Mptc Elections Father

Konaseema: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు రాజకీయ వేదికలపై నిలబడి విజయం సాధించిన అరుదైన, ఆసక్తికరమైన ఘటన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల్లో తండ్రీకూతుళ్లు ఇద్దరూ వేర్వేరు పార్టీల తరఫున పోటీకి దిగి విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయ అభిప్రాయాలు వేరైనా, ప్రజాసేవే లక్ష్యంగా బరిలోకి దిగిన ఈ ఇద్దరి విజయం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట-2 ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతుతో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పొనుగుపాటి చాందిని విజయం సాధించారు. మరోవైపు, అదే మండలంలోని పలివెల-2 ఎంపీటీసీ స్థానం నుంచి ఆమె తండ్రి పొనుగుపాటి సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఒకే కుటుంబంలో ఒకరు కూటమి, మరొకరు వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తూ విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాల్లో మరో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. కొత్తపేట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థి పొనుగుపాటి సత్యనారాయణ. కూతురు కూటమి విజయపరంపరలో భాగమైతే, తండ్రి పార్టీ తరఫున ఒంటరిగా గెలిచి తన ఉనికిని చాటుకున్నారు.