కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తును అణచివేసేందుకు ప్రయత్నించారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని బాధితురాలి తల్లి ఆరోపించింది. తనకు పరిహారం కూడా అందజేస్తామని చెప్పినట్లు పేర్కొంది. కాగా.. ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలను మమత ఖండించారు. ఈ దుష్ప్రచారం తమ ప్రభుత్వం పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర అని అన్నారు. ఈ క్రమంలో.. బాధితురాలి తల్లి స్పందిస్తూ, ‘మీకు నష్టపరిహారం ఇస్తామని, మీ కుమార్తె జ్ఞాపకంగా ఏదైనా తయారు చేయిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. నేను మాత్రం నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు మీ కార్యాలయానికి వచ్చి పరిహారం తీసుకుంటాను’ అని చెప్పానని తెలిపింది.
Mahavir phogat: వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి వెళ్లడం తప్పు.. పెద్దనాన్న మహవీర్ వ్యాఖ్య
రాష్ట్రంలో అత్యాచారం, హత్య ఘటనపై నిరసనను ఆపాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేసింది. అలాగే దుర్గాపూజ ఉత్సవాలకు సిద్ధం కావాలని సీఎం ప్రజలను కోరింది. ఈ క్రమంలో.. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ఇది అమానవీయమని పేర్కొంది. ‘నేను ఒక ఆడపిల్లకు తల్లిని కాబట్టి ఇలా చెప్పడం అమానుషంగా భావిస్తున్నాను. నా కూతుర్ని పోగొట్టుకున్నాను. దేశవ్యాప్తంగా ప్రజలు పండుగ చేసుకోవాలనుకుంటే, చేసుకోవచ్చు. మా ఇంట్లో కూడా మా కూతురుతో దుర్గాపూజ జరుపుకున్నాం. నా కూతురు ఇప్పుడు ఉంటే ఇంట్లో జరుపుకునేది. కానీ.. ఇప్పుడు నా జీవితంలో చీకటి ఏర్పడింది.’ అని తెలిపింది. తన ఇంట్లో ఇలాంటి ఘటన జరిగి ఉంటే.. ఇలా మాట్లాడి ఉండేదా? అని బాధితురాలి తల్లి ప్రశ్నించింది.