Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ శిల్పం తొలగింపు

  • మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య
  • సాల్ట్‌లేక్ స్టేడియంలో శిల్పం తొలగింపు
  • మమత స్వయంగా డిజైన్ చేసిన ఫుట్‌బాల్ శిల్పం
Kolkata

Kolkata

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ హయాంలో నిర్మించిన కట్టడాలపై ప్రస్తుత ప్రభుత్వం బుల్డోజర్ చర్యలకు దిగింది. తాజాగా కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియం దగ్గర మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన శిల్పాన్ని బుల్డోజర్‌తో తొలగించారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

మే 4న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బెంగాల్‌లో 15 ఏళ్ల మమత సర్కార్‌ను బీజేపీ కూల్చేసింది. భారీ విజయంతో కమలం పార్టీ గెలిచింది. ఇక ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించారు.

అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన శిల్పాన్ని శనివారం ఉదయం బీజేపీ ప్రభుత్వం కూల్చేసింది. కోల్‌కతాలోని ప్రముఖ సాల్ట్‌లేక్ స్టేడియం వీవీఐపీ గేట్ సమీపంలో ఉన్న ఈ శిల్పం 2017లో ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ సందర్భంగా ఏర్పాటు చేశారు. రెండు కాళ్లు, పైభాగంలో ఫుట్‌బాల్ ఆకారంతో రూపొందించిన ఈ నిర్మాణం అప్పటినుంచి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. పలువురు ఫుట్‌బాల్ అభిమానులు దీని డిజైన్‌ను వింతగా.. అసహజంగా ఉందని విమర్శించారు. మరోవైపు కొందరు మాత్రం ఇది స్టేడియానికి ప్రత్యేక గుర్తింపుగా మారిందని అభిప్రాయపడ్డారు.

ఇక ఈ శిల్పంపై ‘బిశ్వ బంగ్లా’ లోగో కూడా ఉండేది. ఇది తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుగా భావించేవారు. శిల్పాన్ని తొలగించడంపై బీజేపీ నేత కేయా ఘోష్ స్పందిస్తూ.. “సాల్ట్‌లేక్ స్టేడియం ముందు ఉన్న ఆ వికృత నిర్మాణాన్ని హామీ ఇచ్చినట్టుగానే తొలగించాం” అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇటీవలే బెంగాల్ క్రీడాశాఖ మంత్రి నిశిత్ ప్రమాణిక్ కూడా ఈ శిల్పంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఇంత గొప్ప స్టేడియం ముందు ఇలాంటి అసహజమైన నిర్మాణం ఉండటం సరైంది కాదు. దీనికి ఎలాంటి అర్థం లేదు. అందుకే తొలగిస్తున్నాం” అని పేర్కొన్నారు. అలాగే స్టేడియంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు.

మరోవైపు ఈ శిల్పాన్ని రాజకీయంగా కూడా బీజేపీ నేతలు టార్గెట్ చేశారు. “ఈ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాతే గత ప్రభుత్వానికి చెడు రోజులు ప్రారంభమయ్యాయి. తర్వాత మెస్సీ టూర్ వివాదం కూడా జరిగింది. చివరకు ప్రభుత్వం కూడా అధికారాన్ని కోల్పోయింది” అంటూ నిశిత్ ప్రమాణిక్ వ్యాఖ్యానించారు.