NTV Telugu Site icon

Kolkata Doctor Case: ‘దేశం ఆత్మపై దాడి’.. సీజేఐ వద్దకు చేరిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్య కేసు

Cji

Cji

Kolkata Doctor Case: కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వద్దకు చేరింది. ఆర్మీ కాలేజీకి చెందిన వైద్యుడి పిటిషన్‌తో సహా మూడు లేఖ పిటిషన్లు సీజేఐకి పంపబడ్డాయి. ఈ భయంకరమైన ఘటనపై సీజేఐ స్వయంచాలకంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు. ఇద్దరు పిటిషనర్లు సుప్రీంకోర్టు న్యాయవాదులు రోహిత్ పాండే, ఉజ్వల్ గౌర్ కాగా.. మూడో పిటిషనర్ పేరు డాక్టర్ మోనికా సింగ్. ఆమె సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ కాలేజీలో పని చేస్తున్నారు. రోహిత్ పాండే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, ఉజ్వల్ గౌర్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నారు.

Read Also: Paramilitary Attack: పారామిలటరీ బలగాల నరమేధం.. 80 మంది సామాన్యులు హతం

ఈ కేసు చాలా భయంకరమైనదని, అరుదైనదని సుప్రీంకోర్టు లాయర్లు రోహిత్ పాండే, ఉజ్వల్ గౌర్ అన్నారు. ఇది మన దేశ ఆత్మపై అణచివేత అని, ఒక వైద్యుడిపైనే కాదు మానవత్వంపైనా దాడి జరిగిందన్నారు. ఈ విషయంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ తగిన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అనాగరిక ఘటన యావత్ దేశం ఆత్మను కదిలించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధిత కుటుంబం రోధిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయిందన్నారు. అయితే ఈ ఘటనపై మాట్లాడేందుకు మాటలు చాలవన్నారు. ఒక దేశంగా మనం నిలబడాలని, ఈ విషయంలో సత్వర విచారణ, న్యాయం జరిగేలా చూడాలని కోరారు.ఈ విషయంలో న్యాయవ్యవస్థ తగిన చర్యలు తీసుకుని ప్రజలకు సందేశం పంపాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక ఘటనలను సహించేది లేదు. స్త్రీ ఆత్మగౌరవం, చట్టాన్ని పరిరక్షించడం కోసం చర్య అవసరం. ఈ కేసును సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంచాలకంగా పరిగణలోకి తీసుకోవాలని డాక్టర్ మోనికా సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో భద్రతకు సంబంధించి కోర్టు కూడా తగిన సూచనలు ఇవ్వాలని అన్నారు. ఆసుపత్రుల రక్షణకు కేంద్ర బలగాలు అవసరమన్నారు.

Read Also: Vinesh Phogat: స్వదేశానికి విచ్చేసిన భారత స్టార్‌ రెజ్లర్‌.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవలు మాత్రమే నడుస్తున్నాయి.