Site icon NTV Telugu

Kohli-Rohit: కోహ్లీ-రోహిత్ ముందే వీడ్కోలు పలికారా?.. 50 ఏళ్ల వయసులో టెస్ట్ క్రికెట్ ఆడిన ప్లేయర్స్ వీరే!

Kohli Rohit Test

Kohli Rohit Test

ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మే 7న రోహిత్, మే 12న విరాట్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రో-కో రిటైర్మెంట్‌తో అభిమానులు నిరాశ చెందారు. కొంతమంది క్రికెట్ మాజీలు అయితే ఇద్దరూ కొంతకాలం టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాల్సిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విరాట్ మైదానంలో ఇప్పటికీ యువ ఆటగాడిలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. కోహ్లీ వయసు కేవలం 36 కాగా.. రోహిత్ వయసు 38 సంవత్సరాలు.

ఇప్పటివరకు ఏ భారత ఆటగాడు 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడలేదు. భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన అతి పెద్ద వయసు క్రికెటర్ వినూ మన్కడ్. వినూ తన చివరి టెస్టును 41 సంవత్సరాల 305 రోజులలో ఆడాడు. అంటే వినూ మన్కడ్ కూడా 50 ఏళ్ల కు చాలా దూరంలో ఉన్నాడు. అయితే ప్రపంచంలో 50 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడిన నలుగురు క్రికెటర్లు ఉన్నారని మీకు తెలుసా?. ఇంగ్లండ్‌ తరఫున ముగ్గురు, ఆస్ట్రేలియా తరఫున ఒకరు 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసులో టెస్ట్ క్రికెట్ ఆడారు.

విల్ఫ్రెడ్ రోడ్స్:
అత్యధిక వయసులో టెస్ట్ క్రికెట్ ఆడిన రికార్డును విల్ఫ్రెడ్ రోడ్స్ పేరుపై ఉంది. రోడ్స్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు అతడి వయసు 52 సంవత్సరాల 165 రోజులు. ఇంగ్లండ్‌ తరపున రోడ్స్ 58 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 30.19 సగటుతో 2325 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో రోడ్స్ 127 వికెట్లు కూడా పడగొట్టాడు.

హెర్బర్ట్ ఐరన్‌మోంగర్:
హెర్బర్ట్ ఐరన్‌మోంగర్ టెస్ట్ క్రికెట్ ఆడిన రెండవ పెద్ద వయస్కుడుగా ఉన్నాడు. హెర్బర్ట్ తన చివరి టెస్టు 50 సంవత్సరాల 327 రోజులలో ఆడాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ ఐరన్‌మోంగర్ ఆస్ట్రేలియా తరఫున 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో అతను 42 పరుగులు చేశాడు.

విలియం గిల్బర్ట్ గ్రేస్:
ఇంగ్లీష్ లెజెండ్ విలియం గిల్బర్ట్ గ్రేస్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు అతడి వయసు 50 సంవత్సరాల 320 రోజులు. గ్రేస్ 22 టెస్టుల్లో 32.29 సగటుతో 1,098 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో గ్రేస్ 26.22 సగటుతో 9 వికెట్లు పడగొట్టాడు.

జార్జ్ గన్:
ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ గన్ తన చివరి టెస్ట్ మ్యాచును 50 సంవత్సరాల 303 రోజులలో ఆడాడు. జార్జ్ 15 టెస్ట్ మ్యాచ్‌ల్లో 40 సగటుతో 1120 పరుగులు చేశాడు. అతడు టెస్టుల్లో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు బాదాడు.

 

 

Exit mobile version