NTV Telugu Site icon

Kodali Nani: ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ నాకు రెండు కళ్లు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani

Kodali Nani

Kodali Nani: గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై తనకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమ ఉందని.. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామన్నారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఎమ్మెల్యే నానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు తెలియజేశారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులనుద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రసంగించారు.

పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. అన్న ఎన్టీఆర్ వారసులు, అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టీడీపీ కార్యక్రమాలకు వెళితే.. ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశామని ఆయన ఆరోపించారు. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు గాని, లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పలేదన్నారు. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే, ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారని.. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తేనే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు వస్తాయన్నారు. ఎవరైతే పెద్ద ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారో.. పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారన్నారు. పెద్ద ఎన్టీఆర్‌కు దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారని విమర్శించారు. తాను పెద్ద ఎన్టీఆర్ భక్తుడినని, నందమూరి హరికృష్ణ గురువు అని, వైసీపీలో ఉన్నా రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతానన్నారు.

Read Also: CM YS Jagan: సీఎం జగన్‌ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..

తాను తిరిగే కారుకు ఎన్టీఆర్, వైయస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతానన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో తను ఉన్న బాంధవ్యం విడదీయరానిదని.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ తనకు రెండు కళ్ళు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ గౌడ, యాదవ, మత్స్యకార, ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించిందని.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి నెలకొందన్నారు. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించిందన్నారు. ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు, తనకు అభిమానులు మద్దతుగా నిలవాలని కోరారు. జూ.ఎన్టీఆర్‌ను ఒక వీఐపీగా గౌరవిస్తామన్నారు. ఆత్మీయ సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు యార్లగడ్డ మురళి, చింతలగుంట ఫణి,పాలెం నాని, బండి కోటి బాబు, కేశన మహేష్, యార్లగడ్డ నాని, మోహన్ యార్లగడ్డ, పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.