ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి) లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ అంశపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలని పేర్కొన్నారు. “మనం బ్రతకడానికి, మన సోకులకు ప్రభుత్వ భూములు అమ్మొద్దు, ఒకవేళ ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ, చివరకు చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది” అని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాటలను గుర్తు చేశారు.
READ MORE: Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు!
“నేడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకుని జీవవైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయి. ఇందులో 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు, మష్రూమ్ రాక్ తో సహా సహజసిద్ధంగా ఏర్పడి ఎంతో ఆకర్షణీయంగా ఉండే రాళ్ళ అమరికలెన్నో ఉన్నాయని అనేకమంది ప్రముఖులు తెలియజేస్తున్నారు. ఈ భూమిని కాంక్రీట్ నిర్మాణాలతో నింపేస్తే, భూమిలో నీటివనరులు తగ్గిపోయి, ఆయా జీవజాతులకు నష్టం జరిగి, పర్యావరణానికి, నగరానికి పెద్దఎత్తున ముప్పు చేకూరే అవకాశం ఉంది. పర్యావరణానికి మీరు చేయబోయే ఈ నష్టం తిరిగి పూడ్చలేనిది. హైటెక్ సిటీ, బంజారాహిల్స్ వలే కాంక్రీట్ అడవిగా మారనివ్వొద్దు. పచ్చదనం కాపాడటం మన బాధ్యత.” అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని సూచించారు.
READ MORE: HYDRA: హైడ్రా అధికారులపై దాడికి యత్నించిన బీఆర్‌ఎస్ నేతలు