Kishan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈనెల 11 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా జరగనున్న కార్యక్రమం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రైతాంగ సమస్యలు, రుణమాఫీ కాకుండా బాధపడుతున్న రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత సమస్యలు, మహిళా సమస్యలు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
Read Also: Jagga Reddy: గంగా ప్రక్షాళన మోడీ అందుకే చేస్తున్నారా..?
బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 11వ సారి ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని.. ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో రుణమాఫీకి సంబంధించిన కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని.. రోజు వేల సంఖ్యలో రైతులు కాల్స్ చేస్తున్నారని చెప్పారు. మాకు రుణమాఫీ కాలేదు.. ఎవరూ సహాయం చేయట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఏ ప్రాతిపాదికన రుణ మాఫీ చేస్తున్నారో అర్థం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
కాల్స్ మాట్లాడటానికి మొదట్లో ఒక్కరిని పెట్టామని.. రైతుల నుంచి రోజుకి వేల కాల్స్ వస్తుండడంతో ఇప్పుడు ఆరుగురిని పెట్టినా కాల్స్ లిఫ్ట్ చేయడానికి సమయం సరిపోవట్లేదన్నారు. వచ్చే నాలుగున్నరేళ్లు కష్టపడి పని చేయాలని నేతలకు సూచించారు. మనమీద ఆశతో ప్రజలు తెలంగాణలో 36 శాతం ఓట్లు ఇచ్చారని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేద్దామంటూ కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలు అనుకూలంగా ఉందన్నారు. రేపు చేయాల్సింది ఈరోజే చేసేలా…ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేసే విధంగా సన్నద్ధం కావాలన్నారు.