రైతులు పత్తి అమ్ముకోవడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రైతులు తొందరపడి దళారుల చేతిలో పడొద్దని, పత్తి కొనుగోలు విషయంలో అస్సలు భయపడవద్దన్నారు. పత్తిని మొత్తం కొనుగోలు చేయాలను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ప్రధాని మోడీ ఆదేశించారని తెలిపారు. 12 శాతం వరకు తేమ ఉన్నా సీసీఐ పత్తిని కొంటుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎఫ్‌సీఐ, సీసీఐపై రివ్యూ చేసిన కిషన్ రెడ్డి.. ఈరోజు మీడియాతో కాటన్ ప్రోక్యూర్ మెంట్‌పై మాట్లాడారు.
‘గతేడాది తో పోల్చుకుంటే పత్తి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా 557 కొనుగోలు కేంద్రాలు ఉంటే.. తెలంగాణలో 122 కేంద్రాలు ఉన్నాయి. గతం కంటే 10 కేంద్రాలు పెంచాము. ప్రాంతీయ భాషల్లో పత్తి సేద్యం, ఉత్పత్తి, అమ్మకం సంబంధిత అంశాలపై కిసాన్ యాప్‌ను రూపొందించడం జరిగింది. అమ్మకం కోసం యాప్‌లో అప్లై చేసుకుంటే అన్ని వివరాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. జిన్నింగ్ మిల్లులను కూడా గుర్తించడం జరిగింది. 2004 నుండి 2014 మధ్యలో గత కేంద్ర ప్రభుత్వం 24 వేల కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేసింది. 2014 నుండి 2024 మధ్యలో లక్ష 37 వేల కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేసింది. దీపావళి తరవాత పత్తి కొనుగోలు చేస్తాం. యాప్ దీపావళి నుండి అందుబాటులోకి వస్తుంది’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.400 కోట్లు!
‘నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయి. డీలర్ షిప్లు రద్దు చేసి జైలుకు పంపిస్తాం. పీడీ యాక్ట్ కూడా పెడుతున్నాం. ఈ రోజు నుండి 24వ తేదీ వరకు పత్తి కొనుగోలు, మొబైల్ యాప్‌పై అధికారులు అవగాహన కార్యక్రమాలు చేస్తారు. సర్దార్ పటేల్ కారణంగా హైదరాబాద్ సంస్థానంలో మూడు రంగుల జండా ఎగిరింది. ఈ సంవత్సరం సర్దార్ పటేల్ 150 వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. యువత కేంద్రంగా కార్యక్రమాలు జరుగుతాయి. అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగాలని నిర్ణయించాము. ప్రజాప్రతినిధుల మూడు రోజుల పాదయాత్ర ఉంటుంది, వివిధ కార్యక్రమాలు ఉంటాయి. జిల్లా కలెక్టర్లు సమన్వయం చేస్తారు. 2047 వికసిత భారత్ లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాం’ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.