NTV Telugu Site icon

Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగిస్తూ.. కేంద్రంపైనే నిందలా?

Kishanreddy

Kishanreddy

కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగిస్తూ.. కేంద్రంపైనే నిందలా? అంటూ కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రకటనలో ‘తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కోతకొచ్చిన పంటలు పాడై రైతులు నష్టపోవడం విచారకరం. ఇలా నష్టపోయిన రైతులను ఆదుకోవలసిన బాధ్యత నిస్సందేహంగా ప్రభుత్వాలదే. దీనిని దృష్టిలో పెట్టుకొనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొదట్లో ఈ పథకంలో చేరిన తెలంగాణ ప్రభుత్వం, ఆ తర్వాత కారణాలేమీ చెప్పకుండానే ఈ పథకం నుంచి వైదొలిగింది. అలాగని రాష్ట్ర ప్రభుత్వానికి.. వివిధ కారణాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించే విషయంలో ఏదైనా స్పష్టత, నిర్దిష్ట ప్రణాళిక ఉందా? అంటే అదీ లేదు. ఇలాంటి ప్రణాళిక ఏదీ లేకుండానే కేవలం రాజకీయ కారణాలతో ‘ఫసల్ బీమా యోజన’ నుండి వైదొలిగింది. నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో పంట నష్టపోయిన తెలంగాణ రైతులు సరైన నష్టపరిహారం అందకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. అదే సమయంలో.. ‘ఫసల్ బీమా యోజన’ అమలులో ఉన్న సమయంలో దీని ద్వారా చాలా మంది రైతులు లబ్ధి పొందారు. ఇప్పటికీ.. ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో.. పంట నష్టపోయిన లక్షలాదిమంది రైతులు పరిహారాన్ని పొందుతున్నారు.

ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రైతులకు నష్టపరిహాన్ని ప్రకటించే క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయడం లేదంటూనే.. రాష్ట్ర ఖజానా నుంచి కాకుండా, SDRF (రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి) నుండి రైతులకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పారు. తదనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం మెమో విడుదల చేసింది. వాస్తవానికి.. SDRF లో 75% నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. 2014-15 నుండి ఇప్పటి వరకు ₹2,196.60 కోట్లను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర SDRF కు విడుదల చేసింది. దీంతోపాటుగా NDRF క్రింద ₹873.27 కోట్లు విడుదల చేసింది. SDRF, NDRF కలిపి.. మొత్తం ₹3,069.87 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో ₹188.80 కోట్లను రాష్ట్ర SDRFకు కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది.

1 ఏప్రిల్, 2022 నాటికి రాష్ట్ర SDRF అకౌంట్ నందు ₹608.06 కోట్ల నిధులు ఉన్నాయి. అంటే ప్రస్తుతం పంట నష్టపోయిన రైతులకు అవసరమైన సహాయాన్ని అందించటానికి సరిపడినన్ని నిధులు రాష్ట్ర SDRF లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరిత్యాల వలన నష్టపోయిన వారికి నష్టపరిహారాన్ని అందించటం కోసం కేంద్ర ప్రభుత్వం తనవంతుగా సహాయసహకారాలను అందిస్తున్నప్పటికీ.. ముఖ్యమంత్రి మాత్రం కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. పంట నష్టపోయిన రైతుల బాధను అర్థం చేసుకుని వారికి సహకారం అందించడం కంటే, కేంద్రం మీద నిందలు మోపి ప్రచారం పొందటం మీదే సీఎం దృష్టి కేంద్రీకరించినట్లు స్పష్టమవుతోంది. 1 ఏప్రిల్ 2022 నాటికి అకౌంట్లో ఉన్న రూ.608 కోట్ల బ్యాలెన్స్ కు, 2022-23కు గానూ మొదటి విడత (22 జూలై, 2022నాడు) ఇచ్చిన రూ. 188.80 కోట్లు, రాష్ట్ర వాటా రూ.62.80 కోట్లు మొత్తం కలిపితే ప్రస్తుతం SDRF అకౌంట్లో 859 కోట్లకు పైగా నిధులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే రైతులమీద ప్రేమ ఉన్నట్లయితే, నష్టపోయిన రైతులకు SDRF ఇస్తున్న పరిహారంతో పాటుగా.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాను. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందిన ప్రస్తుత సమయంలో నిజాలను దాచి, ప్రజలను మభ్యపెట్టాలని చూడటం బీఆర్ఎస్ నాయకుల అవివేకమే.ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేయడం మానుకొని ప్రజలముందు వాస్తవాలను చెబితే హుందాగా ఉంటుందని సూచిస్తున్నాను.’ అని ఆయన పేర్కొన్నారు.