NTV Telugu Site icon

Kishan Reddy : సీఎం రేవంత్‌ రెడ్డికి కిషన్‌ రెడ్డి లేఖ

Kishanreddy

Kishanreddy

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి లేఖ రాశారు. గ్రామీణ భారతదేశంలోని ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ పథకాన్ని 2016 లో ప్రారంభించిందన్నారు. పథకం ప్రారంభ సమయంలో గ్రామీణ భారతదేశంలోని సొంతిల్లు లేని పేద కుటుంబాలకు ఆయా రాష్ట్రప్రభుత్వాల సహకారంతో మార్చి, 2024 నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు కిషన్‌ రెడ్డి. మొదటి విడత గడువు ముగిసిన ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండవ విడతలో భాగంగా ఏప్రిల్, 2024 నుండి మార్చి, 2029 మధ్య కాలంలో మరో 2 కోట్ల పక్కా ఇళ్లను సొంతిల్లు అవసరమున్న గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలకు నిర్మించి ఇవ్వాలని తద్వారా కనీసం 10 కోట్ల మందికి లబ్ధిని చేకూర్చాలని 09.08.2024 న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నారు.

అంతేకాకుండా..’ఇందులో మొదటగా 2018 లో [Awaas+ (2018) list] ఇళ్లు అవసరం ఉన్నవారికోసం కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో పాల్గొని ఆయా రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అందించిన జాబితాలో ఇంతవరకూ ఇళ్లు మంజూరు కాకుండా మిగిలిపోయిన వారికి , 2011 లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుల గణన [Socio Economic Caste Census (SECC) 2011 Permanent Wait List (PWL)] జాబితాలో ఇంతవరకూ ఇళ్లు మంజూరు కాకుండా మిగిలిపోయిన వారికి తొలి ప్రాధాన్యతను ఇచ్చి ఇళ్లను మంజూరు చేయనున్నారు. పై రెండు జాబితాలు పూర్తయిన అనంతరం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో సొంతిల్లు అవసరం ఉన్న వారికి ప్రత్యేకంగా సర్వే నిర్వహించి వారికి కూడా ఇళ్లను మంజూరు చేయనున్నారు.

Delhi: కేజ్రీవాల్‌కు ఎల్జీ షాక్.. సీఎం ప్రతిపాదన తోసిపుచ్చిన వీకే.సక్సేనా

పై రెండు జాబితాల ప్రకారం ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలకు సొంతింటి కల పూర్తిగా నెరవేరగా, ఇంకా ఇళ్లు మంజూరు కాకుండా మిగిలిపోయిన వారి జాబితాను అస్సాం, బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి అందించాయి. గ్రామీణ తెలంగాణలో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాలు లక్షలాదిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వం, 2018 లో కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించిన సర్వేలో భాగం కాలేదు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇళ్ల కోసం ఎటువంటి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. తద్వారా, సొంతిల్లు అవసరం ఉన్న గ్రామీణ తెలంగాణ పేద కుటుంబాలకు ఎటువంటి సహకారం అందక సొంతిల్లు నిర్మించుకోవాలన్న వారి కల కలగానే మిగిలిపోయింది. రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో పేద ప్రజలకు ఆశ చూపించి మభ్యపెట్టిందే తప్ప సొంతంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారం తెలంగాణ ప్రజలకు అందకుండా అన్యాయం చేసింది.

AP Govt: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు..!

ప్రజాప్రతినిధిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేను చేసిన అనేక పర్యటనలలో సొంతిల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరినవారు అనేకం ఉన్నారు. ఇదే విషయాన్ని 09.08.2024 న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధానమంత్రి గారు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దృష్టికి తీసుకురాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే ఇళ్లను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.

కావున, ఈ విషయంలో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రామీణ తెలంగాణలో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను వీలయినంత త్వరగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ పథకం ఫలాలను ఆయా కుటుంబాలకు అందించి వారి సొంతింటి కలను సాకారం చేయడంలో సంపూర్ణ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. ‘ అని కిషన్‌ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Show comments