శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో ‘అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.. ఆదర్శ వ్యక్తిత్వం, మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం భారతీయులందరికీ ఆదర్శం. ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించడం, ఈ ప్రయత్నంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకపోవడం, అన్ని బంధాలకు సరైన గౌరవాన్నిస్తూ ఆదర్శవంతమైన జీవితం గడపటం శ్రీరామచంద్రుని జీవితం నుంచి మనకు లభించే అతిముఖ్యమైన పాఠం. శ్రీరామ నవమి పర్వదినం రాముని ఆదర్శ వ్యక్తిత్వాన్ని మనకు గుర్తుచేసే పండగ. ఆయన చూపించిన ధర్మ మార్గం వైపు మనల్ని నడిపిస్తూ.. మన కుటుంబం, సమాజం, దేశం పట్ల మన కర్తవ్యాలను, బాధ్యతలను గుర్తు చేసే ఉత్సవం.
Also Read : India-Russia: భారత్‌కు మరింతగా రష్యా చమురు.. ఇరు దేశాల మధ్య తాజా ఒప్పందం..
నేటికీ ఎవరు మాట్లాడినా రామరాజ్యం గురించే ప్రస్తావించడం.. మన జీవితాలపై శ్రీరాముడి ప్రభావం ఎంతలా ఉందో చెప్పేందుకు ఒక ఉదాహరణ. లంకా నగరాన్ని ఓడించి తిరిగి జన్మభూమికి వస్తున్న సమయంలో శ్రీరాముడు.. ‘అపిస్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని చెబుతాడు. లక్ష్మణా ఎంతటి స్వర్ణమయమైనదైనా.. లంకపై నాకు ఎటువంటి ఆశ, కోరిక లేవు. ‘కన్నతల్లి, జన్మభూమి’ అనేవి స్వర్గం కన్నా గొప్పవని ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేశం పట్ల, మన ధర్మం పట్ల గౌరవాన్ని కలిగిఉంటూ.. మన కర్తవ్యాలు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా శ్రీరాముడు చూపించిన మార్గంలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీరామ నవమి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలను, సుఖశాంతులను, సమృద్ధిని తీసుకురావాలని అభిలషిస్తున్నాను. శ్రీరామచంద్రుడి ఆదర్శాలతో యువతరం నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని ఆయన వెల్లడించారు.
Also Read : BAN Vs IRE: లిటన్ దాస్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డుకు బ్రేక్