Kiren Rijiju: ‘‘రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పొచ్చు’’.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..

  • విద్యార్థుల నిరసనలపై లోక్‌సభలో వాడివేడి చర్చ.
  • అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు కిరణ్ రిజిజు కౌంటర్.
  • "ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దు" అంటూ రుజువులు కోరిన కేంద్ర మంత్రి.
  • సభలో చేసే ఆరోపణలు వాస్తవాల ఆధారంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా సూచన.
Kiren Rijiju

Kiren Rijiju

Kiren Rijiju: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాంటీ-పేపర్ లీక్ బిల్లు, విద్యార్థి నిరసనలపై ప్రతిపక్షం బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వివాదస్పదంగా మారాయి. విద్యార్థులపై కాల్పులు జరపడానికి, బలప్రయోగం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ అరోపించారు.

రాహుల్ గాంధీ ఆరోపణలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలకు ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పగలనని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా ఎవరిపైనా ఏ ఆరోపణ అయినా చేయవచ్చని తాను ఈ ఉదాహరణ చెప్పానని కిరన్ రిజిజు అన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో చేసే ప్రతీ ఆరోపణ వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాందీ చేసే వ్యాఖ్యలు సభా రికార్డుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని, అందువల్ల బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. చర్చ జరిగే సమయంలో ప్రతిపక్షాలు హోంమంత్రి సమాధానం చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులపై కాల్పుల ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.