Atchannaidu: ఏపీ హేట్స్ జగన్ అనే పేరుతో పుస్తకాన్ని విడుదల చేసింది టీడీపీ.. జగన్ హయాంలో జరిగిన పరిణామాలు.. పెరిగిన ధరలు.. పన్నుల భారం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఏపీ హేట్స్ జగన్ అనే పుస్తకాన్ని రూపొందించారు.. మద్యం, ఇసుక, మైనింగ్ వంటి అంశాల్లో భారీ అవినీతి జరిగిందని పుస్తకంలో టీడీపీ ముద్రించింది.. వివిధ వర్గాలపై దాడులు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య ఆరోపణలు.. దళితులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపిస్తూ ఏపీ హేట్స్ జగన్ బుక్ లెట్ రిలీజ్ చేశారు.. ఇక, ఈ సందర్భగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ‘ఏపీ హేట్స్ జగన్’ అంటున్నారని తెలిపారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వృద్ధులు, వికలాంగులు సహా అన్ని వర్గాల వారు జగన్ రెడ్డి బాధితులే అని విమర్శించారు.
2014లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని గట్టెక్కించగలడని నమ్మిన ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు.. 2019 ఎన్నికల సమయంలో ప్రజల్ని హామీలతో, మోసపు వాగ్ధానాలతో నమ్మించడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారన్నారు అచ్చెన్నాయుడు.. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ప్రజల్ని వేధిస్తూ, రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ, తన దుర్మార్గపు పాలనను నిరాటంకంగా సాగిస్తున్నాడు.. తన దోపిడీ, అవినీతిపై ప్రజల్లో చైతన్యం వస్తే తనకు, తనప్రభుత్వానికి సమాధి కడతారన్న భయంతో చేయని నేరానికి చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపాడని మండిపడ్డారు. ఇక, జైల్లో ఉన్నా చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై, టీడీపీపై నిందలేస్తూ ప్రజల్ని ఇంకా మోసగించే ప్రయత్నం చేస్తున్నాడు. తాను ప్రజల బిడ్డను అంటున్న జగన్ రెడ్డి.. అసలు బిడ్డంటే ఏమిటో చెప్పాలని నిలదీశారు. నమ్మిన వారిని నట్టేట ముంచడమే 4 ఏళ్లలో జగన్ బిడ్డ చేసిన నిర్వాకం అని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దుచేసి, ఇసుక దోపిడీతో రూ.40వేలకోట్లు కొట్టేయడమే జగన్ బిడ్డ చేసిన మంచి అని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు.. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ తో సమానమని చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని నెరవేర్చకుండానే అన్నీ చేసేశానని ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు చాంతాడంత ఉంటే, వాటిలో అమలు చేసినవి చారెడంతే అన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, జాబ్ క్యాలెండర్ హామీలు తుంగలో తొక్కి యువత భవితను చిదిమేశాడు. ప్రత్యేక హోదాకు మంగళం పాడి రాష్ట్రయువత నోట్లో మట్టికొట్టాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైందో.. రాష్ట్రంలో ఎక్కడా మద్యం దొరక్కుండా చేస్తానన్న వాగ్ధానం ఏమైందో ముఖ్యమంత్రి మహిళలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దు హామీపై జగన్ ఉద్యోగులకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు. పోలవరాన్ని పూర్తిచేస్తానని చెప్పి, చివరకు నాలుగున్నరేళ్లలో 4శాతం పనులు కూడా ఎందుకు చేయలేదో రాష్ట్ర రైతాంగానికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాజధాని అమరావతిని నాశనం చేసి, మూడు రాజధానుల నాటకమాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. విశాఖపట్నాన్ని కబళించి, అక్కడి భూములు.. ప్రకృతి వనరుల్ని కబళించడానికే జగన్ రెడ్డి రుషికొండపై ప్యాలెస్ నిర్మించుకుంటున్నాడు. అమరావతి నిర్మాణంపై విమర్శలు చేసిన బొత్స సత్తిబాబు నేడు రుషికొండపై జగన్ నిర్మిస్తున్న రాజప్రాసాదంపై నోరు విప్పడేం? అని నిలదీశారు. ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ అనుకునేంత అమాయకులు కారు. సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెడతారు అని హెచ్చరించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.