Site icon NTV Telugu

Atchannaidu: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు.. అమిత్‌షా ఆహ్వానం మేరకే..!

Atchannaidu

Atchannaidu

Atchannaidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిగిపిన విషయం విదితమే.. అయితే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆహ్వానం మేరకే చంద్రబాబు హస్తినకు వెళ్లినట్టు వెల్లడించారు.. అక్కడి పరిణామాలపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా, అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటుంది.. కానీ, వైఎస్‌ జగన్ లా వ్యక్తిగత స్వార్ధం కోసం ఉండదని స్పష్టం చేశారు.. బీజేపీ కాళ్లపై పడటం, కాళ్లు మొక్కటం వైసీపీ సంస్కృతి.. తెలుగుదేశానికి ఆ అవసరం లేదన్న ఆయన.. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా వైఎస్‌ జగనే కాళ్ల మీద పడతాడు. వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టం అని వార్నింగ్‌ ఇచ్చారు.

Read Also: Cheating Case: పెళ్లి పేరుతో మోసం.. మహిళా సినీ నిర్మాతపై కేసు..

ఇక, నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన నిర్వహించారు.. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు.. ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు.. రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు అంటూ బ్యానర్ ప్రదర్శించారు. ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు ఉందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం రూపంలో పట్టిన శని, దరిద్రం నేటితో వదిలిపోతుందన్నారు.. ప్రభుత్వం గత 5ఏళ్లుగా చేసిన ప్రతీ చట్టమూ రాష్ట్ర వినాశనం కోసమే. రాష్ట్రంలో నిరుద్యోగం, మహిళల భద్రత ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. 27 వేల ఖాళీలతో మెగా డీఎస్సీ ఇస్తామని యువతను మోసగించారు. 5 ఏళ్ల ప్రజావ్యతిరేక విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని అసెంబ్లీ ముందే తగలపెడతాం అన్నారు. కౌరవ సభను మళ్లీ గౌరవ సభగా మారుస్తాం. శాసనసభను సైతం 5 ఏళ్లుగా వైసీపీ కార్యాలయంలా నడిపారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు.

Exit mobile version