NTV Telugu Site icon

Badradri: ఎన్నికల వేళ 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్‌

New Project (8)

New Project (8)

Badradri: తెలంగాణ ఎన్నికల వేళ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో 25 మంది వ్యాపార వేత్తలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు సహకరిస్తే చంపేస్తామని వారిని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన దాదాపు 25 మంది వ్యాపారస్తులు బుధవారం ఉదయం 7 గంటలకు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గొల్లపల్లిలో నిర్వహిస్తున్న వారాంతపు మార్కెట్‌కు ఆటోలు, బైకుల్లో బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం, సుక్మా జిల్లాల సరిహద్దులోని తాళ్లగూడెం-గొల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద మావోయిస్టులు వారు వెళ్తున్న వాహనాలు అడ్డుకుని వ్యాపారులను దించేశారు. ఆటోలు, వాహనాల్లోంచి నిత్యావసర వస్తువులు, మద్యం సీసాలు బయటికి విసిరి పారేశారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు లాక్కొని అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లారు. వీరిలో కొందరు మహిళా వ్యాపారులు కూడా ఉన్నారు.

Read Also:Election Ink: ఎన్నికల ‘సిరా’ తయారు చేసేది ఎక్కడో తెలుసా?

పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నారని..నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరిపై దాడికి పాల్పడ్డారు. అలాంటిదేమీ లేదని, సొంత వ్యాపారం చేసుకుంటున్నామని మమ్ములను వదిలేయమని వేడుకున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తే చంపేస్తామని బెదిరించారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యాపారులు తమ వాహనాల్లో పోలీసులకు సరుకులు తీసుకెళ్తున్నారు. ముందుగా వెళ్లిన వారిని మావోయిస్టులు అపహరించుకుపోయారని గ్రహించిన వ్యాపారులు తమ వాహనాలను వెనక్కి తిప్పారు. గమనించిన మావోయిస్టులు వారిని వెంబడించారు. కానీ వారు మావోయిస్టుల నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు కిందపడి గాయపడ్డారు. పరారైన ఇద్దరు వ్యాపారులు పోలీసు ఇన్‌ఫార్మర్లుగా మారారని.. వాళ్ల గనుక తమకు దొరికితే చంపేస్తామని మావోయిస్టులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనతో సంత వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.

Read Also:Telangana Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న వెంకటేష్‌, చిరంజీవి!