మంగళవారం హైదరాబాద్ చందానగర్‌లోని ఖాజానా జ్యువెలరీ షాప్‌లో దొంగలు దోపిడీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. పట్టపగలు తుపాకులతో చొరబడిన దుండగులు 10 నిమిషాల పాటు షాప్‌లో బీభత్సం సృష్టించారు. ఖాజానా జ్యువెలరీ సిబ్బందిలో ఒకరిపై కాల్పులు జరిపి.. వెండి వస్తువులు, 1గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం 12 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై తాజాగా మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నాం అని, త్వరలోనే ఛేదిస్తాం అని చెప్పారు.
డీసీపీ వినీత్ కుమార్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఖజానా జ్యువెలరీ దోపిడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాం. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టాము. ఘటన అనంతరం గోల్డెన్ అవర్ టైం లీడ్ తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఎస్ఓటీ పోలీసులు, సీసీఎస్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ ఆర్మడ్ ఫోర్సెస్ టీమ్స్ పని చేస్తున్నాయి. ఈ కేసులో కొన్ని లీడ్స్ వచ్చాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నాం. దొంగలు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. ఖజానా జ్యువెలరీ సిబ్బంది నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. డే అండ్ నైట్ మా పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల బోర్డర్, ఆయా జిల్లాల పోలీసులని అప్రమత్తం చేశాం. ఏ క్షణంలోనైనా దుండగులని పట్టుకుంటాం. దొంగలు రాబరీ కోసం అటెంప్ట్ చేసిన తీరు పరిశీలిస్తే మధ్యప్రదేశ్, హర్యానా, బీదర్ రాష్ట్రల చెందిన దోపిడి దొంగల ముఠాలు అనుమానిస్తున్నాం. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ప్రత్యేకంగా ఈ కేసు మానిటరింగ్ చేస్తున్నారు. దుండగులను త్వరలో పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెడతాం. ఈ కేసు ఛాలెంజ్‌గా తీసుకున్నాం, త్వరలోనే ఛేదిస్తాం’ అని మాదాపూర్ డీసీపీ చెప్పారు.