Fake Baba Arrest: కామారెడ్డి జిల్లా పోలీసులు ఓ దొంగ బాబను అరెస్ట్ చేశారు. క్షుద్ర పూజల పేరిట లక్షల్లో దోచుకుంటున్న వ్యక్తి గుట్టు రట్టు చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీపేటకు చెందిన దుమ్మల్ల బీరవ్వ.. ఇంటికి.. కొద్ది రోజుల క్రితం వాస్తు పరిజ్ఞానం, అతీంద్రియ శక్తులు ఉన్నట్లు ఓ దొంగ బాబా వచ్చాడు. మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని వాటి కారణంగా మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు, అశాంతి పెరుగుతున్నాయంటూ చెప్పాడు. వాటిని తీయకపోతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని భయపెట్టాడు.
READ ALSO: Erracheera: యదార్థ సంఘటన ఆధారంగా.. ‘ఎర్రచీర – ది బిగినింగ్’
అంతే కాదు.. క్షుద్ర పూజలు చేసి లంకె బిందెలు తీసివేస్తామని నమ్మించాడు. దీనికి రూ. 8.20 లక్షలు డిమాండ్ చేశాడు. బీరవ్వ కుటుంబం ఇటీవల సదరు వ్యక్తిని కామారెడ్డిలో కలిసి.. డబ్బులు అందించింది. ఆ తర్వాత అతను ఫోన్ ఎత్తకపోవడంతో.. మోసపోయినట్లు గుర్తించి కామారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి.. ప్రధాన నిందితుడు సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన కడమంచి నర్సింలు అలియాస్ నర్సిరెడ్డిగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశారు కామారెడ్డి పోలీసులు. అతని నుంచి రూ.7లక్షల నగదుతోపాటు సెల్ ఫోన్ 2 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో అతని మరో ఇద్దరు అనుచరులను త్వరలో పట్టుకుంటామని కామారెడ్డి జిల్లా ఎస్పీ.. రాజేష్ చంద్ర తెలిపారు…
వేములవాడకు మండలం చీర్లవంచకు చెందిన నర్సింలు మరో ఇద్దరితో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేశాడు. ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని.. గుప్త నిధుల పేరిట, క్షుద్ర పూజల పేరిట భయభ్రాంతులకు గురి చేసి.. వారి నుంచి లక్ష్లల్లో వసూలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. గతంలోనూ.. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన లాస్య అనే మహిళ ఇంటికి బిక్షాటన కోసం వెళ్లి.. లంకె బిందెల పేరిట ఇదే తరహాలో రూ. 14 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వద్ద రూ. 3 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. ఇదే తరహాలో మోసాలు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. నర్సింహులుపై ఇతర జిల్లాల్లోనూ.. ఈ తరహా కేసులు ఉన్నట్లు చెప్పారు జిల్లా ఎస్పీ. ఇలాంటి దొంగ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు. క్షుద్ర పూజలు, లంకె బిందెల పేరిట భయ భ్రాంతులకు గురిచేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
READ ALSO: Adani Group: అదానీకి ఆనందం.. నిమిషాల్లో లక్ష కోట్లు పెరిగిన కంపెనీ లాభం!
