NTV Telugu Site icon

Telangana BJP: బీజేపీలో కీలక మార్పులు..! బండిని తప్పిస్తే పార్టీ చీఫ్ ఎవరు..?

Bjp

Bjp

Telangana BJP: తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయా? ఇదే ఇప్పుడు కమలనాథుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సోమవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం ఉన్నందున టీబీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే చర్చ మరింత హీటెక్కిపోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యమంటున్న బీజేపీ.. రాష్ట్ర పార్టీ నాయకత్వం మార్పుపై దృష్టి సారించిందా.. అంటే అవుననే వాదన వినిపిస్తోంది. బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కమలదళంలో హోరెత్తిపోతోంది. బండి సంజయ్‌ను మారిస్తే.. బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు కిషన్‌రెడ్డికి అప్పగిస్తారనే టాక్‌ వినిపిస్తోంది.

అయితే, కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు గట్టిగానే వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం.. కిషన్‌రెడ్డిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ తెలంగాణ చీఫ్‌ పదవి చేపట్టేందుకు కిషన్‌రెడ్డి అంగీకరిస్తే.. బండి సంజయ్‌ను ఏ పదవి వరిస్తుంది. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో.. కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోడీ.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తెచ్చే దిశగా వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని, అలానే కొన్ని రాష్ట్రాల్లోని పార్టీ అధ్యక్షులను మారుస్తారని కమలదళంలో చర్చ జరుగుతోంది.

ఈ లిస్ట్‌లో తెలంగాణ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ను బీజేపీ తెలంగాణ చీఫ్ పదవి నుంచి తప్పిస్తే.. ఆయనను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి మరో బీజేపీ నేతకు కేంద్ర సహాయ మంత్రి ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక, ఇటీవల తెలంగాణలోని బీజేపీలో జరుగుతున్న పరిణామాలను పార్టీ హైకమాండ్‌కు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి పార్టీ హైకమాండ్‌ సూచనలు చేసింది. మరోవైపు ఈటల రాజేందర్‌కు బీజేపీ ఎన్నికల కమిటీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. అసలు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుకి, ఎన్నికల షెడ్యూల్‌కు లింక్‌ పెడుతున్నాయి పార్టీ వర్గాలు. నవంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు జరిగితే.. పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు వస్తే బండి సంజయ్‌ను మార్చే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే.. బీజేపీకి ఆత్మహత్యాసదృశ్యమే అన్నారు మాజీ ఎంపీ విజయరామారావు. అదే జరిగితే బీజేపీలో ఇక చేరికలు ఉండవని జోస్యం చెబుతూ ట్వీట్ చేశారు. పైగా కమలనాథులు.. పార్టీని వీడతారని హెచ్చరించారు. ఇక, తాజాగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారిపోయిన విషయం విదితమే.

Show comments