Heavy rains continue to lash Kerala: గత రెండు రోజులుగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను కారణంగా.. దక్షిణ భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్టల్ కర్నాటక, దక్షిణ ఇంటీరియర్ కర్నాటక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ-మహేలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర, యానాం, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఈ నెల 26 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
Also Read: Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకృతి విపత్తులు కూడా సంభవించే ప్రమాదం ఉందని సూచించారు. మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో పర్యటించే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఐఎండీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరుగుప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు సహాయక బృందాలు అలర్ట్‌గా ఉండాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.