Kedarnath Yatra: దేశంలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఢిల్లీ-ముంబై సహా దేశంలోని పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఉత్తరాఖండ్‌కు కూడా చేరుకున్నాయి. దీని కారణంగా ఆదివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రంలోని కొండలు, మైదాన ప్రాంతాలలో అడపాదడపా వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తత కారణంగా, సోన్‌ప్రయాగ్‌లో ప్రయాణికులను నిలిపివేశారు. అంతేకాకుండా కేదార్‌నాథ్ యాత్రను కూడా ఆపేశారు.
కేదార్‌నాథ్ యాత్రకు సంబంధించి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్‌వార్ మాట్లాడుతూ.. గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ నుండి ఉదయం 10.30 నుండి ప్రయాణికులు అక్కడే ఉండాలని కోరారు. ఈరోజు(ఆదివారం) ఉదయం 8 గంటల వరకు సోన్‌ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్‌కు మొత్తం 5,828 మంది ప్రయాణికులు బయలుదేరారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్లు మూసుకుపోయిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Read Also:Assam Flood: అస్సాంలో వరద విధ్వంసం.. 9 జిల్లాల్లో 4 లక్షల మంది నిరాశ్రయులు
వర్షం మధ్యే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి చేరుకున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి.. అధికారులు, ఉద్యోగులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డెహ్రాడూన్‌లో వర్షం కారణంగా 9 రోడ్లు బ్లాక్ చేయబడ్డాయి. ఒక రాష్ట్ర రహదారి, తొమ్మిది గ్రామీణ రహదారులపై శిధిలాలు ఉన్నాయి. రహదారులను తెరవడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని డెహ్రాడూన్ వాతావరణ శాఖ డైరెక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి డెహ్రాడూన్ సహా ఏడు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, చంపావత్, పిథోరాఘర్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Also:Monsoon: 62 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఢిల్లీ, ముంబై చేరిన రుతుపవనాలు