KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను స్మరించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ది వేడుకలను ముగించుకునే సందర్భంలో అమరులకు ముందుగా నివాళి అర్పిద్దామన్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో పార్లమెంటరీ పంథాలో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర సాధనకోసం భావజాలవ్యాప్తి సాగించి తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సకలజనులకు బోధించి., పోరాటంలో సబ్బండ వర్గాలను సమీకరించి అనేక వ్యూహాలను ఎత్తుగడలను అమలుపరిచి కేంద్రాన్ని కదిలించి, తెలంగాణకు సానుకూలంగా దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలను ఒప్పించి, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక సందర్భాలని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఎన్నో త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్ట పరుచుకుంటూ సమర్థవంతంగా పాలనను అందించిన పదేండ్ల స్వయంపాలనకాలం దేశానికి అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణను ఒక రోల్ మోడల్‌గా నిలిపిందన్నారు.
Read Also: CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
అమరుల త్యాగాలను వృథా పోనీయకుండా పదేండ్ల పాటు ప్రజల భాగస్వామంతో సాధించిన ప్రగతిని ప్రజాసంక్షేమాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. బాధ్యతతో చిత్తశుద్ధితో, వ్యక్తిగత ద్వేష భావనలకు తావివ్వకుండా , తెలంగాణ సమాజ ప్రగతి,సంక్షేమమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన నిజమైన ప్రజా సంక్షేమ పాలన స్ఫూర్తినందుకొని ముందుకుసాగడం ద్వారానే ప్రస్తుత ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చగలదని కేసీఆర్ స్పష్టం చేసారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి అర్పించేందుకు శనివారం కొనసాగిన అమర జ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీ ని విజయవంతం చేయడం పట్ల పార్టీ శ్రేణులకు తెలంగాణ వాదులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా జూన్2., జూన్3 తేదీల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొని నాటి ఉద్యమ స్పూర్తిని చాటుతూ..విజయవంతం చేయాలని మరోసారి కేసీఆర్ పార్టీ శ్రేణులకు తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు.