జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఒక రౌడీ షీటర్‌కు టికెట్ ఇచ్చిందని తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు, తెలివితేటలకు ఈ ఎన్నిక ఒక కఠిన పరీక్ష పెట్టిందని అభిప్రాయపడ్డారు. విజ్ఞులైన ప్రజలు రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ‘కాంగ్రెస్ హయాంలో తెలంగాణ గుల్ల అయింది. బైపోల్స్‌లో బీఆర్ఎస్ విజయం ఖాయమైంది. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపిస్తారు. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారింది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి.. కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయి. కాంగ్రెస్ దుష్టపాలనపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుంది. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలోనూ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారు’ అని అన్నారు.
Also Read: Smriti-Pratika: అదరగొట్టిన స్మృతి, ప్రతీక.. ప్రపంచ రికార్డును సమం!
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత.. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. 14న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీట్ కోసం ఎన్నిక జారుతున్న విషయం తెలిసిందే.
