బీజేపీ దేశాన్ని పదేళ్ల నుంచి పరిపాలిస్తోందని.. బీజేపీ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మోడీ కనీసం ఒక 100 నినాదాలు చెప్పాడు.. ఒక్కటన్న నిజమైందా అని ప్రశ్నించారు. మోదీ చెప్పిన కట్టుకథలు, పిట్ట కథలు నిజమయ్యాయా.? గెలిస్తే ప్రతి కుటుంబానికి 15లక్షలు వస్తాయని మోడీ చెప్పాడు.. వచ్చాయా.? అని ఓటర్లను అడిగారు. క్లాక్ టవర్ సర్కిల్ వద్ద కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టి జాతీయ హోదా కోసం 100 ఉత్తరాలు రాశామని తెలిపారు. ఇవాళ బీజేపీ అభ్యర్థి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు.? అని ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దులో రైతు ఉద్యమంలో 750 మంది రైతులు మరణించారని చెప్పారు.
READ MORE: KKR vs PBKS: పంజాబ్ బౌలర్లను ఆటాడేసుకున్న కేకేఆర్ బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
స్వయంగా నేనే వెళ్ళి రైతు కుటుంబాలకు పరిహారం అందించానని గుర్తు చేశారు. చట్టం ప్రకారం ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు ఇవ్వాలి.. ఒక్కటన్న నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీ కి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. వ్యవసాయ బావుల దగ్గర మోటర్లకు మీటర్లు పెట్టకపోతే రూ.5వేల కోట్ల గ్రాంట్ నిలిపివేస్తామని చెప్పినట్లు ఆరోపించారు. నా ప్రాణం పోయినా, తలకాయ తెగిన మీటర్లు పెట్టను అని చెప్పారు. ఇక్కడ చోటే భాయి, అక్కడ బడే భాయికి ఓటేసిన ఒక్కటే.. మన నీళ్ళు తరలించుకుపోయిన రఘువీరా రెడ్డి పాదయాత్ర చేస్తే డీకే అరుణ మంగళ హారతులు పట్టిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయ్యింది.. మాకు ఓటు వేస్తే నిమిషాల మీద చేసేస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నడుస్తలేదు. చేనేత కార్మికుల స్కీమ్ లు రద్దు చేశారు. నా కళ్ళ ముందు తెలంగాణను నాశనం చేస్తే ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని కేసీఆర్ అన్నారు. తెచ్చిన తెలంగాణ ను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోవాలా… యుద్ధం చేద్దామా? ఏటువంటి పొరటానికైన యుద్ధం చేద్దామన్నారు. భువనగిరిలో బిజెపి, కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గద్దె దించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పంచుకున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీని దెబ్బ తీసి ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తున్నాయన్నారు. ఒక పార్టీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారు.. ఇంకొకరేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. చేసేది ఉంటే ముందే చేయాలని మండిపడ్డారు. ఒట్లు పెడితే ప్రజలు నమ్మరు. 5 ఎకరాలు దాటితే ఇవ్వం అంటున్నారు… నీ అయ్య జాగిరా? ఆ రైతులు తెలంగాణ బిడ్డలు కాదా.? రానున్న రోజుల్లో రైతు బంధు, భీమా ఉంటదో ఉండదో. కులాలు, మతాలకు అతీతంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.