Site icon NTV Telugu

Beerla Ilaiah : ఇప్పుడు గుర్తుకు వచ్చిందా… ఎమ్మెల్సీ కవితపై బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు

Ilaiah

Ilaiah

Beerla Ilaiah : తెలంగాణలో రాజకీయ విమర్శలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ కవితపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కవిత ఇప్పటికైనా తెలంగాణ పట్ల సోయి చూపించడం గమనార్హమని చెప్పారు. సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని ఇప్పుడు కవితకు అర్థమవుతోందంటే, గత 10 ఏళ్లలో తండ్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు ఆమె గుర్తించుకుంటున్నట్లు తెలుస్తోందని ఐలయ్య ఎద్దేవా చేశారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులు, అప్పులు గురించి కవిత ఒక్కమాట కూడా మాట్లాడలేదని, రైతుబంధు పథకంపై నిజమైన రైతులకు లాభం లేదన్న ఆరోపణలపై అప్పట్లో స్పందించలేదని గుర్తు చేశారు బీర్ల ఐలయ్య. భూమిలేని వ్యవసాయ కూలీలకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను పట్టించుకోకపోయారని ఆరోపించారు.

మా ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని కూలీలకు సాయం చేస్తోందని, అప్పుడు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నవాళ్లను ప్రశ్నించని కవితకు ఇప్పుడు సామాజిక న్యాయం గుర్తొచ్చిందా? అని ఐలయ్య ప్రశ్నించారు.

ఆర్టీసీ సమ్మె సమయంలో 30 మంది కార్మికులు చనిపోయినా కవిత స్పందించలేదని ఐలయ్య గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు వచ్చి తన ప్రాధాన్యం తగ్గిపోవడమే కవిత ఇప్పుడీ మాటలు మాట్లాడటానికి కారణం అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడే కవిత తన తండ్రి కేసీఆర్‌ను ప్రశ్నించి ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు.

ఇప్పటికైనా ఆమె కేసీఆర్ పాలనలో జరిగిన తప్పులను బయటపెట్టి ప్రజల రుణం తీర్చుకోవాలని సూచించారు. ఇక బీజేపీ నేతలపై కూడా ఐలయ్య విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కులగణనపై సోయిలేని వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రధాని మోడీ కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారని అన్నారు.

రేవంత్ రెడ్డిని ప్రధాని మోడీ హీరో చేశారని, కులగణన వల్ల దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు పెరిగిందని అన్నారు. ఈ విజయం బీజేపీ నేతలకు జీర్ణించుకోవడం కష్టంగా మారిందన్నారు. బీసీ బిల్లు గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపించడమే మా తొలి ఘనవిజయంఅని ఐలయ్య స్పష్టం చేశారు.

Surya : ఆ విషయంలో ఇప్పటికి బాధపడుతున్న..

Exit mobile version