Karnataka Politics: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన నివాసంలో పలువురు కర్ణాటక ఎమ్మెల్యేలను కలిశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశం గురించి భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వకపోవడంతో గేట్ వద్ద హడావుడి కొనసాగింది. తరువాత మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలతో సమావేశమై వారి సమస్యలను విన్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని శివకుమార్ అన్నారు. “నాకు తెలియదు. నా దగ్గర అంత సమాచారం లేదు. నేను ఎవరినీ అడగలేదు.. నాకు ఏమీ తెలియదు” అని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే తాను ఇంటి నుంచి బయటకు రాలేదని శివకుమార్ చెబుతున్నారు.
READ MORE: Allari Naresh : ‘సుడిగాడు 2’పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!
అసలు ఏం జరిగింది..?
కర్ణాటకలో దీర్ఘకాలంగా ఉన్న అధికార భాగస్వామ్య సూత్రాన్ని అమలు చేయాలని పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకురావడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శిబిరానికి చెందిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త చర్చ జరిగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో ఎవరిని సీఎం చేయాలనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరిపింది. ఆ సమయంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న డీకే శివకుమార్, గతంలో సీఎంగా పని చేసిన సిద్ధరామయ్య పేర్లు తెరపైకి వచ్చాయి. వాళ్లిద్దరిలో కూడా సీనియర్‌గా ఉన్న సిద్ధరామయ్య వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపి సీఎంగా పగ్గాలు అప్పగించింది. అయితే ఆ సమయంలో పలు కీలక శాఖలతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఆ సమయంలో ఈ ఇద్దరు నాయకుల మధ్య రాజీ జరిగిందనే చర్చ బయటికి వచ్చింది. వీరిద్దరి మధ్య 2.5 ఫార్మిలా సయోధ్య జరిగిందనే చర్చ కూడా జోరుగా ప్రచారం జరిగింది. మొదటి 2.5 ఏళ్లు రాష్ట్రంలో సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని, తర్వాత కాలం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పని చేస్తారని ఒక రాజీ జరిగిందనే ప్రచారం బయటికి వచ్చింది.
అందులో భాగంగా మొదటగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని డీకే వర్గం చెబుతుంది. కానీ ఇప్పుడు అనుకున్న సమయం ముగిసిన కూడా సీఎం కుర్చీ శివకుమార్‌కు ఎందుకు ఇవ్వడం లేదనే దానిపై ఆయన వర్గం వాళ్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. గత వారమే సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ హైకమాండ్ పెద్దలతో విడివిడిగా సమావేశం అయ్యారు. పార్టీ పెద్దలకు రాష్ట్రంలోని పరిస్థితులు, ముఖ్యమంత్రి మార్పు అంశంపై వాళ్లిద్దరూ చర్చించినట్లు సమాచారం. అయితే ఆ సమయంలోనే హైకమాండ్ సీఎం మార్పుపై ఏ విషయం అయినా తామే నిర్ణయం తీసుకుంటామని, ఎవరు కూడా ఎటువంటి ఊహాగాలకు పోవద్దని, దీనిపై ఎక్కడ కూడా మాట్లాడవద్దని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఢిల్లీ పర్యటన తర్వాత ఇద్దరు నాయకులు కూడా సైలెంట్‌గా ఉన్నప్పటికి ఇప్పుడు డీకే శివకుమార్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు హస్తినకు బాట పడుతున్నారు. ఈ రాత్రి వాళ్లు బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి డీకే శివకుమార్‌ను సీఎంను చేయాలనే ఒక డిమాండ్‌ను చేసే ఛాన్స్ ఉందని సమాచారం. డీకే వర్గం ఎమ్మెల్యేలు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలుస్తారా, లేదంటే రాహుల్ గాంధీని కలుస్తారా అనేది మాత్రం ఇంకా అధికారికంగా బయటికి రాలేదు.