Karnataka: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో దివాళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ దివాళి సందర్భంగా పలువురు తమకు ఇష్టమైన వారికి బహుమతులు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే కర్ణాటక మంత్రి చేసిన పని ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. సాధారణంగా మంత్రి స్థాయి హోదా అనుభవించే వ్యక్తులు క్షేత్రస్థాయి నేతలు తమ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తపడుతుంటారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నమే చేశారు కర్ణాటక పర్యాటక మంత్రి ఆనంద్ సింగ్.
Read Also: Air Polution: ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం.. దీపావళి వేళ రెచ్చిపోయిన రాజధానివాసులు
దీపావళి సందర్భంగా మంత్రి ఆనంద్ సింగ్ తన నియోజక వర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఖరీదైన వస్తువులను కానుకలుగా అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు, ఇతర గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు సెట్ల బాక్సులు పంపించారు. మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్లకు పంపించిన గిఫ్ట్ బాక్స్‌లో రూ.1 లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి, ఒక సిల్క్ చీర్, ఒక ధోతీ, డ్రై ప్రూట్స్ బాక్స్ ఒకటి పంపించారు. ఇక గ్రామ పంచాయతీ సభ్యులకు పంపించిన బాక్స్‌లో బంగారం మినహాయించి తక్కువ మొత్తం నగదుతో మిగతా వాటినన్నింటినీ పంపించారు. మొత్తం 35 మంది మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు.. 182 మంది గ్రామ పంచాయతీ సభ్యులకు ఈ గిఫ్ట్ బాక్సులను అందజేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఉచితంగా ఎందుకిచ్చారని నిలదీస్తున్నారు.
Read Also: Rishi Sunak: రిషి సునాక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ హోస్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ నియోజక వర్గంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఎన్నికైన వారందరికి ఈ ఖరీదైన గిఫ్ట్‌లను మంత్రి పంపించినట్లు తెలిసింది. అయితే ఈ బహుమతులను తీసుకోవడానికి కొందరు నిరాకరించినట్టు తెలుస్తుంది. ఏదిఏమైనా నగదు, బంగారం పెట్టి పంపించడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.