Site icon NTV Telugu

DK Shivakumar : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ ఊరట..

Dk Shivakumar

Dk Shivakumar

DK Shivakumar : కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ర్ట శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా ఉన్న డీకే శివకుమార్‌ది. కర్ణాటక గెలుపులో డీకేతోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య పాత్ర కూడా ఉంది. వాస్తవానికి ఎన్నికల్లో గెలుపు అనంతరం డీకేనే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది భావించారు. కర్ణాటకలోని కాంగ్రెస్‌ నాయకులు కూడా కొందరు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ డీకేపై సీబీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఆయనను కాకుండా సీనియర్‌ నేత సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌లోని మరికొందరు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి భవిష్యత్‌ అవసరాల రీత్యా కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఖరారు చేసింది. డీకే శివకుమార్‌పై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసు పెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Also: Odisha Train Accident LIVE UPDATES: పట్టాలపై పెనువిషాదం.. ప్రమాదంపై బెంగాల్‌ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులకు సంబంధించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా సీబీఐ విచారణకు మధ్యంతర నిలుపుదలను హైకోర్టు ధర్మాసనం మరింతకాలం పొడిగిస్తూ ఏకసభ్య ధర్మాసనం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణలపై స్టే విధించిన ఏకసభ్య ధర్మాసనం.. ఏ బెంచ్‌ ద్వారా విచారణ జరిపించాలనే అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోదలిచారని పేర్కొంది. చీఫ్‌ జస్టిస్‌ అవగాహన కోసం కేసును బదిలీ చేశారు. మే నెలాఖరుదాకా విచారణ జరపకుండా ఉన్న స్టే ఉన్నది. ప్రస్తుతం మూడోసారి స్టేను పొడిగించారు. సీబీఐ 2020 అక్టోబరు 3న అవినీతి వ్యతిరేక చట్టానికి అనుగుణంగా క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. సదరు కేసు విచారణను రద్దు కోరుతూ డీకే శివకుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణపై విధించిన స్టేను శుక్రవారం పొడిగించారు. కాగా డీకే శివకుమార్‌కు ఉపశమనం లభించినట్టే ఆయన తమ్ముడు, ఎంపీ డీకే సురేశ్‌కు ఊరట లభించింది. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ డబ్బులు పంపిణీ చేస్తున్నారని భద్రావతి పేపర్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసును న్యాయమూర్తి ఎం నాగప్రసన్న రద్దు చేశారు. అప్పట్లో డీకే సురేశ్‌తోపాటు ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. చార్జ్‌షీట్‌ను కొట్టివేయాలని డీకే సురేశ్‌ సహా మిగిలినవారు కోర్టును ఆశ్రయించిన మేరకు విచారణ జరిపిన ధర్మాసనం కేసును కొట్టివేసింది.

Exit mobile version