Odisha Train Accident LIVE UPDATES: ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని భావిస్తున్నారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బోగీల నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఆర్మీ సైతం పాల్గొంటోంది. భువనేశ్వర్ సహా బాలేశ్వర్, భద్రక్, మయూర్‌భంజ్, కటక్‌లోని ఆస్పత్రల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రుల్లోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో బెంగాలీవాసులే ఎక్కువ మంది ఉన్నారనేది ఒక అంచనా. ఇక మృతుల్లో, గాయపడిన వాళ్లలో తెలుగువాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
బాలసోర్‌లోని ఫకీర్ ఆసుపత్రికి ప్రధాని నరేంద్ర మోడీ. ఆసుపత్రిలో బాధితులకు ప్రధాని పరామర్శ. రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మోడీ.
రైల్వే స్టేషన్‌లోనే బాధితులకు ప్రాథమిక చికిత్స. ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేసిన అధికారులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వస్థలాలకు ప్రయాణికులు. స్వస్థలానికి ప్రమాదం నుంచి బయటపడ్డ 45 మంది ప్రయాణికులు. ప్రమాదం తర్వాత 43 రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ.
సహాయక చర్యలపై ప్రధాని మోడీ ఆరా. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. కాసేపట్లో క్షతగాత్రులను పరామర్శించనున్న ప్రధాని మోడీ.
రైలు ప్రమాద స్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ. రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోడీ. ప్రాథమిక రిపోర్టును మోడీకి వివరించిన కేంద్రమంత్రులు.
ఒడిశా రైలు ప్రమాదంపై నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక. గార్డ్ బ్రేక్ వ్యాన్, హాల్ కోచ్‌లు మెయిన్ లైన్‌పై ఉన్నాయి. మొదట సిగ్నల్ ఇచ్చినా.. ఆ తర్వాత దాన్ని ఆపేశారు. దీంతో కోరమాండల్ రాంగ్ ట్రాక్‌పైకి వెళ్లాల్సి వచ్చింది. కోరమాండల్‌కు సిగ్నల్ లభించకపోవడంతో ప్రమాదం. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్ ఢీకొట్టింది.
సాయంత్రం 6.55కు ప్రమాదం. కోరమాండల్ ట్రైన్ 21 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమాండల్ ఇంజిన్ గూడ్స్‌ట్రైన్ ట్రాక్‌లోకి దూసుకెళ్లింది.
ఒడిశా రైలు ప్రమాదంలో 300కు మృతులు చేరొచ్చని అంచనా. వెయ్యి మందికి పైగా క్షతగాత్రులు. భువనేశ్వర్, కటక్ చుట్టుప్రక్కల ఆస్పత్రుల్లో గాయపడ్డవారికి చికిత్స. 2 రైళ్లలో తెలుగువాళ్లు 200 మంది ఉండొచ్చని అంచనా. కోరమండల్ రిజర్వేషన్ జాబితాలో పలువురు తెలుగువాళ్లు. చనిపోయినవాళ్లలో ఎక్కువమంది తమిళ ప్రయాణికులు. కాసేపట్లో భువనేశ్వర్‌కు ప్రధాని మోడీ.
ఒడిశా రైలు ప్రమాద స్థలిని పరిశీలించేందుకు ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఘటనాస్థలిలో అధికారులతో సమీక్షించి.. తర్వాత కటక్ ఆస్పత్రిలో క్షతగాత్రులను ప్రధాని పరామర్శించనున్నారు. ఈ రోజు ఉదయం రైలు ప్రమాదంపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్షించారు.
ప్రమాదంపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని.. ప్రమాద కారణాలపై కేంద్రం దర్యాప్తు చేయాలని వ్యాఖ్యానించారు. బాధితులకు సరైన వైద్యం అందాలని ఆమె అన్నారు. రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. అధికారులతో మాట్లాడి సహాయకచర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను మూడు సార్లు రైల్వే మంత్రిగా పనిచేశానని, గతంలో జరిగిన ఘటనలకు జరిగినట్లే ఈ ప్రమాదంపైనా విచారణ జరపాలన్నారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మరోవైపు రైల్వే ట్రాకుల పునరుద్ధరణ పనులు కూడా మొదలు పెట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
తమిళనాడు మంత్రుల బృందం ఒడిశా చేరుకుంది. ప్రత్యేక వాహనంలో ప్రమాదం స్దలానికి ఉదయనిధి స్టాలిన్ సహా మరో ముగ్గురు మంత్రులు బయలుదేరారు.
ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాపదినంగా ప్రకటించింది.. కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్‌లో గాయపడిన వారికి సాయాన్ని అందించడానికి, అలాగే రక్తదానం చేసేందుకు యువత పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇక ఈ ఘోర ప్రమాదంపై పలువురు ప్రపంచ దేశాల అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్ - వెన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ, భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్, యూఎస్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సాబా కోరోసి, తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ ఘోర ప్రమాదం నుంచి ఉపశమనం కోసం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధమని ఆయా దేశాలు ప్రకటించాయి.
ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో రైలులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి వివరాలను రైల్వే శాఖ తెలిపింది. తమ గమ్యస్థానాలు చేరేందుకు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో షాలిమర్‌లో 39మంది, సంత్రగచ్చిలో 12 మంది ఖరగ్‌పూర్‌లో 21 మంది, బాలాసోర్‌లో ముగ్గురు రైలు ఎక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీకి చెందిన మొత్తం 68 మంది ప్రయాణికులు ఎక్కినట్లు వెల్లడించారు. బెజవాడకు చెందిన 39, ఏలూరు-2, రాజమండ్రి-26, తాడేపల్లిగూడెం-1 రైలు ఎక్కిట్లు తెలిసింది.
కాసేపట్లో రైలు ప్రమాదస్థలికి వెళ్లనున్న ప్రధాని మోడీ.. ప్రమాద స్థలాన్ని పర్యవేక్షించనున్న ప్రధాని.. కటక్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న మోడీ
ఒడిశా బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రైలు ఢీకొని 280 మంది ప్రయాణికుల మృతి, అనేక మంది గాయపడిన ఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన ప్రయాణీకుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన పరికరాలకు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇది నిజంగా ఎన్నడూ జరగకూడని విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాలాసోర్ రైలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలంలో పరిస్థితులను పర్యవేక్షించారు. మృతుల్లో ఎక్కువగా బెంగాల్ ప్రజలే ఉన్నట్లు అంచనా.
ఒడిశా బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన.. పెను విషాదానికి కారణమైంది. ఈ ప్రమాద ఘటనపై కేంద్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో.. రైలు ప్రమాదం, సహాయక చర్యలపై ఈ సమావేశంలో సమీక్ష జరగనుంది. ఒక ప్యాసింజర్ రైలు.. అప్పటికే బోల్తా పడిన మరో రైలును ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బాలాసోర్ రైలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఆయన అక్కడి అధికారులతో ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. "రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం.. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. దర్యాప్తు హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశాం.. ప్రస్తుతం సహాయక చర్యల మీదే ఫోకస్ పెట్టాం.. విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం." అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.