NTV Telugu Site icon

Karnataka: శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం

Tirumala Laddu

Tirumala Laddu

Karnataka: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూ.. వెంకన్న భక్తులకు ఎంతో పవిత్రమైంది. అయితే ఇప్పుడు ఆ లడ్డూ వివాదాస్పదం అయింది. లడ్డూ తయారీలో నెయ్యి కాంట్రవర్సీకి కారణమైంది. తిరుమల లడ్డూ జంతువుల కొవ్వుతో తయారయిందన్న కామెంట్ కలకలం రేపింది. నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతున్న అధికారపక్షం, ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరు భక్తకోటిని గందరగోళానికి గురి చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను తరచూ పరిశీలన జరుపుతుమన్నారు.

Read Also: AP CM Chandrababu: ఒకేసారి రూ.2000 పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమే..

ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడిన కేంద్ర మంత్రి నడ్డా
తిరుపతి ప్రసాదం వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆరా తీశారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో కూడా వివరంగా చర్చించారు. దీనిపై తదుపరి విచారణ జరిపేందుకు వీలుగా నివేదిక ఇవ్వాలని సీఎంను కోరారు. రాష్ట్ర నియంత్రణ అధికారులతో కూడా మాట్లాడి దర్యాప్తు చేస్తానని జేపీ నడ్డా తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఆయన నివేదిక కోరారని, దీనిపై తదుపరి విచారణ జరుపుతామన్నారు.

తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థ సారధి, ఇతర ఉన్నతాధికారులు తిరుమల సమస్యపై సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూల తయారీలో జరిగిన పొరపాట్లపై నేటి (సెప్టెంబర్ 20) సాయంత్రంలోగా సమగ్ర నివేదిక అందజేయాలని టీటీడీని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగమ, వైదిక, ధార్మిక మండళ్లతో చర్చలు జరిపి తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. భక్తుల విశ్వాసాన్ని, ఆలయ సంప్రదాయాలను కాపాడుతామని సీఎం చంద్రబాబు అన్నారు.