NTV Telugu Site icon

Kurnool: కప్పట్రాళ్ల వద్ద తాత్కాలికంగా ఆందోళన విరమించిన గ్రామస్థులు

Kappatralla

Kappatralla

Kurnool: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వద్ద యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని చేపట్టిన ఆందోళనను గ్రామస్థులు తాత్కాలికంగా విరమించారు. ఈ నెల 4వ తేదీన కలెక్టర్‌ వచ్చి చర్చిస్తారనే హామీతో ప్రజలు ఆందోళనను విరమించారు. కప్పట్రాళ్ల యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వేలాది మంది పత్తికొండ-కర్నూలు రహదారిపై బైఠాయించారు. మూడు గంటలపాటు ఆందోళన చేయడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది కప్పట్రాళ్ల, బేతపల్లి, పి.కోటకొండ, చెల్లెలచెలిమిల, నెల్లిబండ, గుండ్లకొండ తదితర గ్రామాల నుంచి తరలివచ్చారు.

Read Also: CM Chandrababu: 2 గంటల్లోనే విశాఖ నుండి అమరావతికి..

కప్పట్రాళ్లు రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలపై కొన్ని గ్రామాల ప్రజలంతా కలిసి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఎదుర్కొనేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కప్పట్రాళ్ల రక్షిత అడవిలో కేంద్ర సర్కారు యురేనియం తవ్వకాలకు 68 బోర్లకు అనుమతులు ఇవ్వడంపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తవ్వకాలకు అనుమతిస్తే అన్ని విధాలుగా నష్టపోతామని ప్రజలు వాపోయారు. యురేనియం అనుమతులు రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్థానిక ప్రజలు హెచ్చరించారు.

ఆదోని రేంజ్‌ పత్తికొండ సెక్షన్‌ పరిధిలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో 468.25 హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి. కౌలుట్లయ్య మలగా పిలిచే ఈ రిజర్వు ఫారెస్ట్‌ కప్పట్రాళ్ల, పి.కోటకొండ, మాదాపురం, చెల్లెలచెలిమిల, గుండ్లకొండ గ్రామాల మధ్య విస్తరించింది. ఆ కొండపైనే కౌలుట్లయ్య స్వామి ఆలయం ఉంది. ఈ ప్రదేశంలోనే సర్వే కోసం అనుమతులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రజలు ఆందోళనకు దిగారు.

 

Show comments