Kapil Dev: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 139 పరుగులతో ఎన్నో రికార్డులు తిరగరాసిన కింగ్.. అందరి చూపు తనవైపునకు తిప్పుకున్నాడు.. అయితే, కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై దిగ్గజ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యం ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించడం తనను బాధించిందని అన్నారు. కొన్నేళ్ల తర్వాత కోహ్లీ తన నిర్ణయంపై పశ్చాత్తాపపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ అజేయంగా 139 పరుగులు చేయడంపై స్పందిస్తూ కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వయసులోనూ కోహ్లీ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని, మరో రెండు, మూడు సంవత్సరాలు తన ఫిట్‌నెస్‌ను కొనసాగించగలిగితే అనేక రికార్డులను బద్దలు కొట్టగలడని పేర్కొన్నారు.
టెస్టుల్లో మరికొంత కాలం ఆడాల్సింది
కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం తనకు అర్థం కావడం లేదని కపిల్ దేవ్ అన్నారు. ఒక మాజీ క్రికెటర్‌గా, ప్రేక్షకుడిగా కోహ్లీ మరికొంత కాలం టెస్టులు ఆడాల్సిందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కోహ్లీకి టెస్ట్ క్రికెట్‌లో రాణించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఆటపై ప్రేమ, ప్యాషన్ ఉన్నప్పుడు తనను తాను ఫిట్‌గా ఉంచుకోగలిగితే ఎందుకు రిటైర్ కావాలని కపిల్ ప్రశ్నించారు. టీ20 క్రికెట్‌కు, టెస్ట్ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుందని, అయితే టెస్ట్ క్రికెట్ కోహ్లీకి బాగా సరిపోయే ఫార్మాట్ అని వ్యాఖ్యానించారు.
రిటైర్మెంట్‌పై మరోసారి ఆలోచించాలంటూ సూచన
కొన్ని సంవత్సరాల తర్వాత ‘ఇంకొంతకాలం టెస్ట్ క్రికెట్ ఎందుకు ఆడలేదు?’ అని కోహ్లీ భావించే అవకాశం ఉందని కపిల్ దేవ్ అన్నారు. కోహ్లీ వయసు 37-38 ఏళ్లకు చేరినా, అతని ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని మరికొంతకాలం ఆడగలడని అభిప్రాయపడ్డారు. అయితే కోహ్లీకి ఏది మంచిదో నిర్ణయించేది అతడేనని కపిల్ స్పష్టం చేశారు. బయట నుంచి తాము సలహాలు మాత్రమే ఇవ్వగలమని, తుది నిర్ణయం మాత్రం కోహ్లీదేనని పేర్కొన్నారు. అదే సమయంలో టెస్ట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని మళ్లీ ఆ ఫార్మాట్‌లోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. వన్డే క్రికెట్‌లో మాత్రం కోహ్లీ మరికొన్ని సంవత్సరాలు కొనసాగాలని కపిల్ దేవ్ ఆకాంక్షించారు.

