NTV Telugu Site icon

Kanjara Gang: కరుడుగట్టిన కంజర గ్యాంగ్ ఆట కట్టించిన సంగారెడ్డి పోలీసులు

Kanjara Gang

Kanjara Gang

Kanjara Gang: అదో దోపిడి గ్యాంగ్. హైవేలపై కాపు కాస్తుంది… దాబాల వద్ద మాటు వేస్తుంది…హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ట్రావెల్స్ బస్సులే టార్గెట్ గా రెక్కి నిర్వహిస్తుంది. ప్రయాణికులు బస్సులో నుంచి దిగగానే అందిన కాడికి దోచుకు వెళ్తారు. ఇది మధ్యప్రదేశ్ కంజర గ్యాంగ్ ముఠా పని. చోరీల్లో ఆరితేరిన ఈ గ్యాంగ్ ఆట కట్టించారు సంగారెడ్డి జిల్లా పోలీసులు.

గత నెల జూలై 26న అర్థరాత్రి సంగారెడ్డి జిల్లాలోని NH-65పై భారీ చోరి జరిగింది. చిరాగ్ పల్లి వద్ద కోహినూర్ దాబా వద్ద ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో నుంచి 2.9 కిలోల బంగారు ఆభరణాల బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ నుంచి నగలను ముంబై తీసుకెళ్తున్న గుమాస్తా గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల్లో చోరీ ఘటన ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట్లో గుమాస్తానే అనుమానించిన పోలీసులు ఆ తర్వాత వేరే కోణంలోనూ విచారణ చేపట్టారు.

Read Also: Macherla Crime: మాచర్లలో విద్యార్థిని మృతి కేసులో ట్విస్ట్‌.. తండ్రి వల్లే..!

కేసును దర్యాప్తు చేసిన పోలీసులు చోరికి పాల్పడింది అంతరాష్ట్ర ముఠా పనేనని అనుమానించారు. ఈ నెల 4న ఎన్ హెచ్ 65 పై బర్థిపూర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇంతలో హైదరాబాద్ కి వెళ్తున్న బ్రీజా కారుని పోలీసులు ఆపి విచారణ చేస్తుండగా.. కారులోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు అలెర్ట్ కావడంతో వెహికిల్ చేజ్ చేశారు. దింతో కారు, కారులో ఉన్న డ్రైవర్ కాకుండా కారులో ఉన్న మరో ముగ్గురు పారిపోయారు. వెంటనే కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

కారులో ఉన్న నిందితుడు మధ్యప్రదేశ్ ధార్ జిల్లా కంజర గ్యాంగ్‌గా చెప్పాడు. కోహినూర్ దాబా వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో చోరీ చేసిన సొమ్ముని అమ్ముకోవడానికి అలాగే సంగారెడ్డి జిల్లాలో మరో దొంగతనానికి వెళ్తున్నట్టుగా నిందితుడు మసూమ్ ఒప్పుకున్నాడు. నిందితున్ని అరెస్ట్ చేసి నిందితులు వాడిన కారుని సీజ్ చేసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ రూపేష్. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

చోరి జరిగిన పది రోజుల్లోపే ఈ కేసుని పోలీసులు చేధించడంతో జిల్లా ఎస్పీ రూపేష్ పోలీసులని అభినందించారు. కంజర గ్యాంగ్ గతంలో హైదరాబాద్ శివార్లలోనూ చోరికి పాల్పడింది. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ఏ మాత్రం నిర్లక్షంగా ఉన్న ఇలాంటి ఘటనలు జరుగుతాయని నగదు, బంగారు ఆభరణాలతో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.