Site icon NTV Telugu

Kaleshwaram Project: కేసీఆర్, హరీష్‌ రావుకు హైకోర్టులో భారీ ఊరట!

Kcr, Harish Rao

Kcr, Harish Rao

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెకేషన్‌ తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు.. తదుపరి విచారణ అక్టోబర్‌ 7వ తేదీకి వాయిదా వేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్‌ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్యంతర పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టు రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించినట్లు కోర్టు దృష్టికి అడ్వకేట్ జనరల్ (ఏజీ) తీసుకెళ్లారు. కేసును తెలంగాణ సర్కార్ సీబీఐకి అప్పగించనున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ కేసీఆర్, హరీష్‌ రావుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు.

Also Read: Road Accident: లండన్‌ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థులు మృతి.. ఐదుగురికి గాయాలు!

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిఫారసు చేసినట్టు చెప్పారు కదా? హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ విచారణ తర్వాత చర్యలు ఉంటాయని ఏజీ కోర్టుకు తెలిపారు. కమిషన్‌ రిపోర్ట్‌లో ఎవరిపైనా చర్యలు తీసుకోవాలన్న అంశం లేదని చెప్పారు. తదుపరి విచారణ వరకు ఇద్దరిపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్, హరీష్‌ రావు పిటిషన్ల విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. పీసీ ఘోష్‌ కమిషన్‌పై ఎంక్వైరీని క్వాష్ చేయాలని అడిగాం అని, ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించిందని కేసీఆర్‌, హరీష్‌ రావు తరఫు లాయర్‌ అర్యమ సుందరం తెలిపారు.

Exit mobile version