జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతీ బ్యారేజ్‌లో సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు పూర్తి చేసింది. పుణేకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో పరీక్షలు పూర్తయ్యాయి. ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఆదేశాలతో ప్యార్లల్ సీస్మిక్ వేవ్ మెథడ్ పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. గతంలో రెండు సార్లు.. ప్రస్తుతం ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వ హించారు. బ్యారేజ్‌లో అప్, డౌన్ స్ట్రీమ్‌లలో 42 వెంట్లో కంప్యూటర్ చిత్రీకరణ ద్వారా భూగర్భంలోని లీకేజీలను అధికారులు పరీక్షించారు. బ్యారేజ్‌లోని 3, 4 బ్లాకుల్లోని వెంట్ల వద్ద పరీక్షలు జరిపారు.
సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం ఈ రిపోర్టులను ఇరిగేషన్ శాఖ అధికారులకు అందజేస్తుందని, వారు ఎన్డీఎస్ఏకు సమర్పిస్తారని ఇంజనీర్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలను అన్నారం బ్యారేజ్‌లో రూ.1.13 కోట్ల వ్యయంతో ఇరిగేషన్ శాఖ చేపట్టింది. జియోఫిజికల్ పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ పరీక్షల నివేదికలు అందజేసిన తర్వాత ఎన్డీఎస్ఏ లీకేజీలపై రిటైనింగ్ వాల్ భూగర్భంలో నిర్మాణం చేపట్టనున్నారా? లేదా గ్రౌటింగ్‌తో మరమ్మతులకు ఆదేశించనున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వారి వెంట బ్యారేజ్ ఈఈ యాదగిరి, సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం సభ్యులు ప్రశాంత్, శివాంగ్, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు.