NTV Telugu Site icon

Kakarla Suresh: కాకర్లకు మద్ధతుగా నారా రోహిత్ ఎన్నికల ప్రచారం

Kakarla

Kakarla

ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 50 గడపలు ఉన్న ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా.. మంగళవారం దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాకర్ల సురేష్ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని తెలిపారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ అనే నేను పోటీ చేస్తున్నానని.. మా గుర్తు సైకిల్ అని సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. మరోవైపు.. దుత్తలూరు మండల కేంద్రంలో టీడీపీ తలపెట్టిన ర్యాలీ దద్దరిల్లింది. దుత్తలూరు గ్రామంలోని కృష్ణ మందిరం నుండి దుత్తలూరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, మేకపాటి శాంత కుమారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బూరి వెంగళరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 50 గడపలు ఉన్న ప్రతి గ్రామంలో మంచినీటి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అభ్యర్థులను చూసి మీరు ఓటు వేయాలని ప్రార్థించారు. అమృత ఘడియలు ఆసన్నమయ్యాయని మంచి కాలం ముందుంది అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రెండు ఓట్ల సైకిల్ కి వేసి అత్యధిక మెజార్టీ అందించాలని ప్రార్థించారు.

మా నాన్నను గెలిపించండి ఉదయగిరి ప్రజలకు అండగా ఉంటాం- సంహేత్
టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేద ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు రూపొందించారని కాకర్ల సురేష్ తనయుడు కాకర్ల సంహేత్ తెలిపారు. జలదంకి మండలంలోని చోడవరం గ్రామంలో మండల టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ నాన్న కాకర్ల సురేష్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని కోరారు. మీరు వేసే ఓటు ఉదయగిరి నియోజక వర్గ అభివృద్ధికి దోహద పడుతుందని తెలిపారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి సేవా భావం కలిగిన వ్యక్తి అని.. ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరోవైపు.. వింజమూరు టీడీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆర్ఎంపీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాకర్ల సురేష్ సోదరుడు.. కాకర్ల సునీల్ ఆర్ఎంపీ డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉదయగిరికి పట్టిన జబ్బు వదలాలంటే మీరందరూ తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుత పాలకులు చేస్తున్న పనులు మీ అందరికీ తెలుసునని, చదువుకున్న మేధావులైన మీరు, పదిమందికి తెలిసేలాగా ప్రస్తుత పరిస్థితులను వివరించాలన్నారు. మరోవైపు.. కలిగిరి మండలంలోని సిద్దన కొండూరులో కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కరపత్రాలను ఇంటింటా తిరిగి పంపిణీ చేశారు. తెలుగు దేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. తన భర్త కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని.. ఇంటింటా తిరిగి మహిళలకు బొట్టు పెట్టి ప్రచారం నిర్వహించారు. ఉదయగిరి అభివృద్ధికి తమ సొంత నిధులతో గత రెండు సంవత్సరాలుగా పాటుపడుతున్నామని తెలిపారు.

పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమం
దుత్తలూరు మండల నాయకత్వంలో చేపట్టిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి గ్రామ గ్రామాల నుండి పసుపు జెండాలతో కలసి వచ్చి మమత మమకారాల చేత మంగళహారతులచేత సోదర భావాల చేత ఆదరభిమానాలతో కాకర్ల సురేష్ కు స్వాగతం పలికారు. మంగళవారం దుత్తలూరు మండలంలో నిర్వహించిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రాగానే రౌడీ రాజ్యాన్ని సాగనంపి రైతు ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఉదయగిరి తలరాత మారాలి అంటే, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఉదయగిరిలో మార్పు జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు. ఉదయగిరి రూపురేఖలు మారుస్తానని అందుకోసం మీ అందరి సహకారం కావాలని ప్రార్థించారు. ఉదయగిరి మెట్ట ప్రాంతంలో వెంటాడుతున్న ప్రధాన సమస్య మంచి నీటి సమస్య అన్నారు. తాను గెలిచిన వెంటనే మొదటి ప్రాధాన్యత మంచినీటి కొరత తీరుస్తానన్నారు. 50 గడపలు దాటిన ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వింజమూరు పట్టణంలో పురవీధుల్లో ఉదయగిరి కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ మరియు కుటుంబ సభ్యులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెట్ట ప్రాంతం అయ్యిన ఉదయగిరి నియోజక వర్గంలో పరిశ్రమలు రావాలంటే కాకర్ల సురేష్ ను గెలిపించాలని కోరారు. అటు.. కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలోని కొత్తూరు గ్రామంలో కాకర్ల సురేష్ మాతృమూర్తి కాకర్ల మస్తానమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీ బిడ్డ మీ గడపకు వస్తున్నారని ఓటు వేసి ఆదరించాలని కోరారు. మీ బిడ్డకు మీరు వేసే ఓటుతో ఉదయగిరి నియోజక వర్గం అభివృద్ధికి బాటలు వేసిన వారు అవుతారని తెలిపారు.