సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వదిలి కుప్పంకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సొంత ప్రాంతంలో గెలవలేని వ్యక్తి.. వైసీపీ నేతలను మాత్రం ఇక్కడ తంతే అక్కడ పడ్డారని విమర్శిస్తున్నారు అని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత ప్రాంతం ఏది, గాజువాకకు ఎందుకు వెళ్లారు? అని మంత్రి కాకాణి ప్రశ్నించారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పు లేకుండా ఉన్నాడని, సొంతంగా రాలేక అందర్నీ కలుపుకొని ఎన్నికలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘నిన్న నెల్లూరులో చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్‌తో మాట్లాడారు. నాయకుల చేరికలతో టీడీపీ బలపడిందని చెబుతున్నారు. ప్రజలు.. ఓటర్లు లేరని ఆయన చెప్పకనే చెప్పారు. నెల్లూరులో పోటీ చేసేందుకు కొందరు అభ్యర్థులు దొరికారు. దాంతోనే ప్రజలు మద్దతు ఇస్తారనుకోవడం సరికాదు. సిద్ధం సభలో వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇవ్వడం లేదు. తన హయాంలో ఏమి అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పడం లేదు. ఆయన ప్రసంగం ఆత్మస్తుతి, పరనిందగా సాగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని సీఎం జగన్ ధైర్యంగా చెబుతున్నారు. మరోసారి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధం అని జగన్ చెబుతున్నారు’ అని అన్నారు.
Also Read: Daggubati Purandeswari: అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు: పురందేశ్వరి
‘మా పథకాలతో పాటు కర్ణాటకలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారు. నెల్లూరు జిల్లాకు ఏం చేశారో చంద్రబాబు చెప్పలేదు. సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వదిలి కుప్పంకు చంద్రబాబు వెళ్లారు. సొంత ప్రాంతంలో గెలవలేని వ్యక్తి.. వైసీపీ నేతలను మాత్రం ఇక్కడ తంతే అక్కడ పడ్డారని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సొంత ప్రాంతం ఏది?, గాజువాకకు ఆయన ఎందుకు వెళ్లారు. ప్రజలు చంద్రబాబును నెగటివ్ షేడ్ తో చూస్తున్నారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పు లేకుండా ఉన్నాడు. సొంతంగా రాలేక అందర్నీ కలుపుకొని ఎన్నికలకు వస్తున్నారు’ అని మంత్రి కాకాణి విమర్శించారు.