NTV Telugu Site icon

Kadiyam Srihari : ఎవరైనా గ్రూపులు అని తిరిగితే తోకలు కత్తిరించడం ఖాయం

Kadiyam Srihari

Kadiyam Srihari

మడికొండ సత్య సాయి కన్వెన్షన్ హాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య పరిచయ, ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. అభివృద్ధిలో అగ్రగామిగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఉండాలన్నారు. ఇప్పుడు నా బాధ్యత పెరిగిందని, నియోజకవర్గంలో గ్రూపులు లేవన్నారు. ఎవరైనా గ్రూపులు అని తిరిగితే తోకలు కత్తిరించడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. పని లో పోటీ పాడుదాం… కూర్చునే సీటులో కాదని, దేవాదుల ప్రాజెక్టు తో నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి సాగు నీరు అందించె బాధ్యత నాది అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా..స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విద్యా, వైద్యంలో చాలా వెనక బడి ఉన్నాం. విద్యా, వైద్యంలో అన్ని రకాల అభివృద్ధికి త్వరలోనే శ్రీకారం చుట్టాలి. నియోజకవర్గంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ఉంది. నా ఎజెండా అభివృద్ధి, విద్యా, వైద్యం, ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించడం. నియోజకవర్గ ప్రజలు నన్ను అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

అనంతరం.. ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. నాకు భారీ మెజారిటీతో విజయాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికీ వారే అభ్యర్థిగా భావించి నా కోసం కష్ట పడ్డారని, నా గెలువుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంటు మీ అందరి కష్టసుఖలలో పాలు పంచుకుంటానని ఆమె అన్నారు. మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, రాబోయే రోజుల్లో మంచి రోజులు రానున్నాయని, ఎంపీ ఎన్నికలతో అయిపోలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురావేయాలని ఆమె అన్నారు. నా తండ్రి కడియం శ్రీహరి పేరు నిలబెట్టే విధంగా పని చేస్తానన్నారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘డాక్టర్ కడియం కావ్య గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. కడియం శ్రీహరి వ్యక్తిత్వం గొప్పది. కడియం శ్రీహరి గొప్ప పరిపాలన అనుభవం ఉన్నది, అవినీతి రహితమైన పాలన అందించే వ్యక్తి కడియం శ్రీహరి. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇదే క్రమశిక్షణతో పని చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరికీ సమూచిత స్థానం దక్కుతుంది. కార్యకర్తలు ఓపికగా ఉండాలి. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి. ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో నిష్పాక్షపాతంగా, అవినీతి రహితంగా అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందాలి. దానికోసం సమన్వయంతో పని చేయాల్సిన బాధ్యత ఉంది. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకోవాలి. రాబోయే రోజులల్లో మంచి రాజకీయ భవిష్యత్ ఉంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గలను సమ దృష్టితో చూడాలి. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలి. ఎల్లపుడు నీకు మా అందరి ఆశీస్సులు ఉంటాయి.’ అని ఆమె అన్నారు.