Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!

Tg Govt

Tg Govt

Telangana Irrigation: జూరాల ప్రాజెక్టు నుంచి పంటలకు నీటి విడుదల చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ కసరత్తు చేస్తోంది. పంటలకు దశలవారీగా నీటిని విడుదల చేయడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే జూరాల నుంచి నీటి విడుదల అంశంపై మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డిలు సెక్రటేరియేట్‌లో ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రితో కీలక సమావేశం నిర్వహించి సంప్రదింపులు జరిపారు. జూరాలకు నీటి ప్రవాహం పెంచేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో స్వయంగా మాట్లాడి, నీటిని విడుదల చేయాలని కోరాలని మంత్రులు నిర్ణయించారు. పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఎల్‌నినో వంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సింది పోయి, ప్రతిపక్షాలు కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం అన్నదాతలను అనవసరంగా రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం విమర్శించింది. తమది ప్రజా ప్రభుత్వమని, రైతాంగానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేస్తూ, సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపింది.

మరోవైపు, రైతులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. ఈ మేరకు జూరాల పర్యటనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌ చందర్‌రావు బయలు దేరారు. దీంతో పోలీసులు జడ్చర్ల బ్లూ ఫాక్స్ హోటల్ వద్ద ఆయనను అడ్డుకొని అరెస్ట్ చేశారు. జడ్చర్లకు తరలించారు. ఇప్పటికే ఆత్మకూరు, అమరచింత గద్వాలలో బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు చేపట్టారు. జూరాల కు వెళ్ళే మార్గాల్లో మూడంచెల బందోబస్త్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్‌రావు అరెస్ట్‌ను నిరసిస్తూ జడ్చర్ల నేషనల్ హైవేపై బీజేపీ శ్రేణులు బైఠాయించారు. పోలీసులకు బీజేపీ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా.. నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా జూరాలకు వెళ్తుండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని జడ్చర్ల వద్ద అరెస్టు చేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. “రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను కలవడం, వారి సమస్యలపై గళమెత్తడం కూడా అరెస్టుకు కారణమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నాటి ఎమర్జెన్సీ మనస్తత్వానికి ఇది నిదర్శనం. విమర్శలను అణచివేయడం, అన్నదాతల తరఫున మాట్లాడేవారి గొంతు నొక్కడం, ప్రజల ఆవేదన వినిపించకుండా చేయడమే వారి విధానం. రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలిచేవారిని అరెస్టు చేస్తుంటే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం మన అన్నదాతలకు అమలుకాని తప్పుడు హామీలు ఇస్తూనే ఉన్నాయి.” అని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.