ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్ల పాలనలో తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, నీటి పంపిణీపై మాట్లాడే ఏ నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కటకట ఉన్నప్పటికీ.. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆయకట్టుకు తాగు, సాగు నీటిని నిరంతరం పంపిణీ చేస్తోందని స్పష్టం చేశారు. పరిస్థితులు ఇలా ఉంటే.. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ప్రచారం కోసమే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నీళ్లు వదలడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆర్భాటాలు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రారంభిస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4.60 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కల్వకుర్తి కింద 25 టీఎంసీల నీటిని ఇచ్చే పనులను ఎందుకు పూర్తి చేయలేదో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నీళ్లు ఇవ్వకపోతే పంటలు కొనడం, బోనస్ చెల్లించడం నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందనడం పూర్తిగా అబద్ధమని తోసిపుచ్చారు. ప్రజలు పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలను చూసే వారిని ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటితో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 100 శాతం పూర్తి చేసి, కృష్ణా జలాలను జిల్లా రైతులకు పూర్తిస్థాయిలో అందించి తీరుతామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

