World Hottest Day: భూమిపైనే అత్యంత వేడి రోజుగా జులై 3 రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ తెలిపింది. జులై 3వ తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 17.01 సెల్సియస్‌కు చేరుకుందని వెల్లడించింది. ఈ వివరాలు మైనే యూనివర్సిటీ అధ్యయనంలో తెలిసినట్లు చెప్పింది. ఫలితంగా 2022 జులై, 2016 ఆగస్టులో నమోదైన 62.46 డిగ్రీల ఫారెన్‌హీట్ రికార్డు బద్దలైందని వివరించింది. వాయవ్య కెనడా, పెరూ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది.
దక్షిణ అమెరికా ఇటీవల ఎండల్లో మగ్గిపోతోంది. ఎండల వేడిని తట్టుకోలేక ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. చైనాలో 35C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో తీవ్రమైన ఎండలు కొనసాగాయి. ఉత్తర ఆఫ్రికాలో 50C సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే అంటార్కిటికాలో ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. అయినప్పటికీ.. అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. శ్వేత ఖండంలోని అర్జెంటీనా దీవులలో, ఉక్రెయిన్ వెర్నాడ్‌స్కీ రీసెర్చ్ బేస్ ఇటీవల 8.7C (47.6F)తో జూలై ఉష్ణోగ్రత రికార్డును బద్దలు కొట్టింది.
Also Read: Tamilnadu: ఇకపై అతిథుల డ్రైవర్లకు హోటళ్లలో వసతి, బాత్‌రూమ్‌లు తప్పనిసరి
ఇది మనం గొప్పగా చెప్పుకోవాల్సిన మైలు రాయి కాదని బ్రిటన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని గ్రాంథమ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడెరిక్ ఒట్టో అన్నారు. అలాగే ఇది ప్రజలకు, పర్యావరణ వ్యవస్థలకు మరణ శిక్ష లాంటిదని కామెంట్ చేస్తున్నారు. వాతావరణ మార్పు, ఎల్‌నినో దీనికి కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. దురదృష్టవశాత్తుగా పెరుగుతున్న ఎల్‌నినోతో పాటు పెరుగుతున్న (కార్బన్ డయాక్సైడ్), గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలతో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల్లో ఇది మొదటి దశగా చెబుతున్నారు.
ఎల్ నినో అంటే తెలుసా?
పసిఫిక్ మహా సముద్రంలో వేడి నీటి పరిస్థితులను తొలిసారిగా 16వ శతాబ్దంలో పెరూ, ఈక్వెడార్ తీరప్రాంత జాలరులు గుర్తించారు. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు చేపలు తక్కువగా పడుతున్నట్టు, ఇది క్రిస్‌మస్ సమయంలో ఎక్కువగా ఉంటున్నట్టు గమనించారు. దీనికి వారు పెట్టుకున్న పేరు ‘ఎల్‌నినో డి లా నేవిడాడ్’. అంటే ‘ద క్రిస్‌మస్ చైల్డ్’.. అనగా బాల ఏసు అని అర్థం. ఆ తర్వాత 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో శాస్త్రవేత్తలు వివిధ దేశాల్లో సంభవిస్తున్న మార్పులకు కారణమేంటనేది తెలుసుకోవటం మీద దృష్టి సారించారు. చివరకు ఇవి ఆయా ప్రాంతాలతో ముడిపడినవి కావని.. ఎల్‌నినో ప్రభావంతోనే ఏర్పడుతున్నాయని 20వ శతాబ్దంలో గుర్తించారు. ఇది సగటున 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుందని తెలుసుకున్నారు. అయితే ఇదేమీ కచ్చితమైన వ్యవధి కాదు. కొన్నిసార్లు రెండేళ్లకూ, మరికొన్ని సార్లు 7 సంవత్సరాలకూ ఏర్పడొచ్చు. సాధారణంగా ఇది 9-12 నెలల పాటు కొనసాగుతుంది. కానీ కొన్నిసార్లు ఏళ్ల కొద్దీ ఉండొచ్చు.
