NTV Telugu Site icon

Virat Kohli Catch Drop: విరాట్ కోహ్లీ క్యాచ్‌ను వదిలేశాం.. మ్యాచ్‌ను కోల్పోయాం! ఆస్ట్రేలియా పేసర్ ఆవేదన

Josh Hazlewood On Kohli Catch Drop

Josh Hazlewood On Kohli Catch Drop

Josh Hazlewood defends Mitchell Marsh over Virat Kohli Catch: టీమిండియా స్టార్‌ క్రికెటర్, చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను ఆస్ట్రేలియా ఫీల్డర్ మిచెల్ మార్ష్‌ జారవిడిచిన సంగతి తెలిసిందే. మార్ష్‌ క్యాచ్ జారవిడిచిన సమయంలో 12 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ.. లైఫ్ దొరకడంతో ఏకంగా 84 రన్స్ చేశాడు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కీలక ఇన్నింగ్స్‌ ఆడి భారత్ విజయానికి బాటలు వేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌తో టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భారత్ బోణీ కొట్టింది.

లక్ష్య ఛేదనలో భారత ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ క్రీజ్‌లో నిలిచేందుకు ప్రయత్నించాడు. అయితే జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్ 3వ బంతికి కోహ్లీ భారీ షాట్‌కు యత్నించాడు. మిడ్‌ వికెట్‌కు కాస్త దూరంలో బంతి లేవగా.. మిచెల్‌ మార్ష్ క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. మరోవైపు వికెట్‌ కీపర్‌ అలెక్స్ కేరీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో మార్ష్‌ క్యాచ్‌ను వదిలిలేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలయిన మార్ష్‌.. క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఇదే ఆసీస్‌ ఓటమికి కారణమైంది. మ్యాచ్‌ అనంతరం ఈ క్యాచ్‌పై పేసర్ హేజిల్‌వుడ్‌ స్పందించాడు.

Also Read: World Cup 2023: తొమ్మిదింట్లో ఒకటే ముగిసింది.. ఎలాంటి కంగారు లేదు!

‘కీపర్‌ అలెక్స్ కేరీ అటువైపుగా వస్తాడని ఎవరూ అనుకోలేదు. మిచెల్‌ మార్ష్ అందుకోవాల్సిన క్యాచ్‌ అది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే కేరీ కూడా దూసుకురావడంతో మార్ష్ అయోమయానికి గురైనట్లుగా అనిపించింది. క్యాచ్‌లను మిస్‌ చేయడం మ్యాచుల్లో మామూలే. ప్రతి మ్యాచ్‌ విజయం కోసం అందరూ చాలా కష్టపడతారు. విరాట్ కోహ్లీ క్యాచ్‌ను జారవిడవడమంటే.. మ్యాచ్‌ను వదులుకున్నట్లే. ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం చాలా కష్టం. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు మరింత కఠినంగా మారింది. అందులోనూ స్పిన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. చెన్నై పిచ్‌పై కనీసం 260 పరుగులు చేస్తే మంచి టార్గెట్‌’ అని హేజిల్‌వుడ్ తెలిపాడు.