John Abraham : కొత్తగా ముఖానికి రంగేసుకున్న కుర్ర హీరోల మొదలు, ముసలి స్టార్స్ దాకా అందరూ మాస్ ను ఆకట్టుకోవడమే ధ్యేయంగా సాగుతున్నారు. అందులో భాగంగా యాక్షన్ మూవీస్ కే వీళ్ళు జై కొడుతున్నారు. అందుకు తానేమీ మినహాయింపు కాదని చెబుతున్నారు బాలీవుడ్ కండల వీరులలో తనదైన బాణీ పలికిస్తోన్న జాన్ అబ్రహామ్. గత కొంతకాలంగా బాలీవుడ్ ఆశగా ఎదురుచూస్తోన్న బ్లాక్ బస్టర్ ను ఈ యేడాది జనవరిలో విడుదలైన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ అందించింది. ఈ చిత్రంలో హీరోకు ఏ మాత్రం తగ్గని ప్రతినాయకుని పాత్రలో జాన్ అబ్రహామ్ ఎంతగానో ఆకట్టుకున్నారు. షారుఖ్, సల్మాన్ సైతం జాన్ అభినయాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఇకపై కూడా తాను యాక్షన్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నానని జాన్ చెబుతున్నారు.
Read Also: Sean Bean : షాన్ బీన్ ఐదో భార్యకు అది బాగా నచ్చిందట!
జాన్ అబ్రహామ్ శరీరాకృతి చూస్తే గ్రీక్ గాడ్స్ గుర్తుకు రాకమానరు. ఆ శరీరదారుఢ్యంతోనే సినిమా రంగంలో నెట్టుకు వస్తున్నారు జాన్. అయితే ఆయనకు నటునిగా ఆట్టే మార్కులు సంపాదించిన చిత్రాలు ఈ మధ్య కాలంలో లేవనే చెప్పాలి. ‘పఠాన్’లో జాన్ అబ్రహామ్ పోషించిన జిమ్ పాత్ర మాత్రం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. అంతేకాదు, ఇందులో బ్యాడ్ మేన్ గా నటించినా, జాన్ నటనకు జనం జేజేలు పలికారు. అలా తనలోని నటునికి ఛాలెంజ్ విసిరే రోల్స్ లభిస్తే, ఎలాంటి వేషాన్నైనా పోషిస్తాననీ జాన్ అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎంతమంది బాలీవుడ్ హీరోలు ఈ బ్యాడ్ మేన్ వెంట పడతారో చూడాలి.