ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విదేశీ మహిళా పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ చేపట్టింది. ఆరోపణలు నిజమని తేలడంతో ప్రొఫెసర్‌ను తొలగించారు. ఈ వేధింపుల సంఘటన కొన్ని నెలల క్రితం ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో జరిగింది. నిందితుడైన ప్రొఫెసర్‌పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..
జపాన్‌కు చెందిన ఓ విద్యార్థిని విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తోంది. యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా ఆమెపై ఓ ఫ్యాకల్టీ సభ్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె జపాన్ తిరిగి వెళ్లిన అనంతరం ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది. అధికారిక ఫిర్యాదును దాఖలు చేసింది. ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయం దృష్టికి తీసుకొచ్చింది.
READ MORE: HP Omen Max 16: HP నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల.. రూ. 10 వేల క్యాష్ బ్యాక్
దీంతో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలు నమ్మదగినవిగా గుర్తించింది. దీని తరువాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిందితుడైన ప్రొఫెసర్‌ను తొలగించాలని సిఫార్సు చేసింది. నిందితుడికి విశ్వవిద్యాలయ అప్పీలేట్ కమిటీ ముందు అప్పీల్ చేసుకునే హక్కు లేదా కోర్టును ఆశ్రయించే హక్కు కూడా ఉందని వర్గాలు తెలిపాయి.
READ MORE: Supreme Court : డ్రైవర్ల పనిగంటలపై ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇదిలా ఉండగా.. ఒక పరిశోధన ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై పర్యావరణ శాస్త్ర విభాగానికి చెందిన మరో అధ్యాపక సభ్యుడిని సైతం తొలగించారు. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి పంపారు. ఈ ప్రాజెక్టుపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక తర్వాత ఇద్దరు బోధనేతర సిబ్బందిని కూడా తొలగించారు. ఇతరులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు.