ఝార్ఖండ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. క్షణక్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయి 24 గంటలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఇంకా గవర్నర్ ఆహ్వానించలేదు. దీంతో రాజ్‌భవన్ వేదికగా ఏం జరుగుతోందోనన్న సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఝార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. హేమంత్ వారసుడిగా ఆ రాష్ట్ర మంత్రి చంపయ్ సోరెన్‌ను శాసనసభాపక్ష నేతగా కూటమి సభ్యులంతా ఎన్నుకున్నారు. ఈ మేరకు బుధవారమే గవర్నర్‌కు సమాచారాన్ని తెలియజేశారు. ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 24 గంటలు గడిచింది.. కానీ ఎలాంటి కబురు రాలేదు. దీంతో తాజాగా మరోసారి గవర్నర్ రాధాకృష్ణన్‌ను చంపయ్ సోరెన్ కలిశారు. జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
కూటమి సభ్యుల నుంచి మద్దతు లేఖను తీసుకున్న గవర్నర్.. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇటీవల బీహార్‌లో అయితే నితీష్‌కుమార్ ఉదయం రాజీనామా చేయడం.. సాయంత్రానికి తిరిగి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోయింది. కానీ ఝార్ఖండ్‌లో మాత్రం అలా జరగలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు చంపయ్‌కు పూర్తి మద్దతు ఉన్న ప్రమాణస్వీకారానికి మాత్రం గవర్నర్ఆహ్వానించడం లేదు. దీంతో సంకీర్ణ కూటమికి అనుమానం రేకెత్తుతోంది. రాజ్‌భవన్ వేదికగా ఏదో కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఎంఎం అధిష్టానం.. ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది.
ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీకి 32, జేఎంఎంకు 41, కాంగ్రెస్, ఆర్జేడీకి 6,
ఏజేఎస్‌యూకి 3 సీట్లు ఉన్నాయి. బీజేపీకి ఏజేఎస్‌యూ మిత్రపక్షం.. దీంతో బీజేపీ బలం 35కి చేరింది. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే పువ్వు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతును బీజేపీ కూడగడుతోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే గవర్నర్ సాగదీస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జేఎంఎం కూటమిని పిలుస్తారా? లేదంటే బీజేపీని పిలుస్తారా? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.