NTV Telugu Site icon

Jharkhand Teacher: కీచక టీచరుకు దేహశుద్ధి

Jharkhand Teacher

Jharkhand Teacher

Jharkhand Teacher: ఆచార్య దేవోభవ అంటూ గురువుకు దేవుడి స్థానాన్ని కల్పిస్తున్న దేశం మనది. ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెచ్చే పనులు చేస్తున్నారు. అలాంటి దిక్కుమాలిన పని చేసిన టీచరుకు స్థానికులు తగిన బుద్ధి చెప్పారు.

పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా పరిధిలోని బరజమ్‌డ లోని ఖాస్జమ్‌డా ప్రభుత్వ అప్‌గ్రేడ్ మిడిల్ స్కూల్‌లో ప్రేమ్ కుమార్ టీచరుగా పనిచేస్తున్నాడు. రోజూ ప్రేమ్ కుమార్ బడికి వచ్చే బాలికలకు అశ్లీల వీడియోలు చూపించేవాడని స్థానిక మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున స్థానిక గ్రామీణ మహిళలు ప్రేమ్ కుమార్ ను పట్టుకున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థినుల కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది, బరాజ్‌మడ ఆజీవిక మహిళా గ్రామ సంఘంతోపాటు బరాజమడకు చెందిన అనేక మంది మహిళలు.. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన ఉపాధ్యాయుడిని మొదట కొట్టారు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్ మొఖానికి మసి పూసి, చెప్పుల దండ వేసి బహిరంగంగా ఊరేగించారు. అనంతరం ఉపాధ్యాయుడు ప్రేమ్‌కుమార్‌ను బరాజ్‌మడ ఓపీ పోలీసులకు అప్పగించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రేమ్ కుమార్ బాలికలు టాయిలెట్‌కు వెళ్లినప్పుడు అక్కడకు వచ్చేవాడంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించే తమని ప్రేమ్ కుమార్ కొట్టేవాడని చెబుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో బస్తీ మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు జమదా బస్తీ నుంచి బరాజ్‌మడకు నడుచుకుంటూ వెళ్తుండగా నిందితుడు  ప్రేమ్ కుమార్ ను పట్టుకున్నారు. పాఠశాల నుంచే బూట్ల దండ, చెప్పుల దండ వేసి గ్రామంలోకి తీసుకొచ్చారు. అనంతరం ప్రేమ్ కుమార్ పై బాధితులు డిప్యూటీ కమిషనర్‎కు లేఖలు అందజేశారు. టీచరును బరాజ్‌మడ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. నిందితుడిని జైలుకు పంపాలని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.