NTV Telugu Site icon

Sita Soren: జేఎంఎంకు సీతా సోరెన్ షాక్.. బీజేపీలో చేరిక

Sita Sorn

Sita Sorn

జార్ఖండ్‌ అధికార పార్టీ జేఎంఎంలో సొంత కుటుంబం నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడి భార్య, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఆ పార్టీకి గట్టి షాకిచ్చారు. సొంత పార్టీకి ఆమె గుడ్ బై చెప్పారు. మంగళవారం ఆమె పార్టీకి రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఆమె కమలం పార్టీలో చేరారు. ఆమె మెడలో పార్టీ కండువా కప్పి బీజేపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు.

అంతకముందు ఆమె జార్ఖండ్ ముక్తి మోర్చా పదవులకు, ఎమ్మెల్యే పదవికి సీతా సోరెన్ రాజీనామా చేశారు. రిజైన్ లెటర్ పార్టీ అధిష్టానానికి పంపారు. సీతా సోరెన్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీతా సోరెన్.. హేమంత్ సోరెన్ సోదరుడు దుర్గా సోరెన్ భార్య. 2009లో 39 ఏళ్ల వయసులో దుర్గా సోరెన్ మరణించారు.

రాజీనామా లేఖను సీతా సోరెన్ హిందీలో రాసి పంపించారు. తన భర్త మరణించినప్పటి నుంచి తనను పార్టీ అవమానిస్తూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు కూడా నిరంతరం అగౌరవపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో అన్ని చక్కబడతాయని భావించాను కానీ.. అలా జరగలేదని ఆమె చెప్పుకొచ్చారు. కుటుంబాన్ని ఏకంగా చేసేందుకు శిబు సోరెన్ ప్రయత్నించినప్పటికీ అలా జరగలేదని ఆమె వాపోయారు.

ఈ ఏడాది జనవరిలో మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇరుక్కున్నారు. దీంతో ఆయన సీఎం పీఠం మీద నుంచి దిగిపోవల్సి వచ్చింది. అనంతరం ఆయన సతీమణి కల్పనా సోరెన్‌‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చని వార్తలు వినిపించాయి. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని తోడి కోడలు సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయ అనుభవం లేని ఆమెను సీఎంగా ఎలా ఎంచుకుంటారని సీతా సోరెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది. అనంతరం హేమంత్ సోరెన్ వారసుడిగా చంపయ్ సోరెన్ సీఎం పీఠంపై కుర్చున్నారు.

ఇది కూడా చదవండి: Mercy Killing: హీరోయిన్ గా జబర్దస్త్ భామ.. “మెర్సి కిల్లింగ్” చేయమంటోంది!

సార్వత్రిక ఎన్నికల ముందు జేఎంఎంకు ఇదొక పెద్ద షాక్‌కు గానే చెప్పొ్చ్చు. ఇప్పటికే అక్కడి కాంగ్రెస్ ముఖ్య నేతలు బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు తాజాగా అధికార పార్టీ నుంచి కూడా బీజేపీలోకి వలసలు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు అధికార పార్టీకి ఎదురుదెబ్బగానే చెప్పొ్చ్చు.

దేశ వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభమై.. జూన్ 1న పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి వరకు రెండు జాబితాలను విడుదల చేశాయి. మూడో జాబితాను కాంగ్రెస్ మంగళవారం విడుదల చేయనుంది.

 

 

Show comments