Site icon NTV Telugu

Enforcement Directorate: ఈడీ కస్టడీకి జెట్‌ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్

Naresh Goyal

Naresh Goyal

Enforcement Directorate: రూ.538 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 11 వరకు రిమాండ్‌ విధించింది. కెనరా బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదు చేశారు.గోయల్ (74)ను ముంబైలోని తన కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద శుక్రవారం రాత్రి ఈడీ అరెస్టు చేసింది. శనివారం ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు.

Also Read: Ashok Gehlot: రాజస్థాన్ సీఎంకి ఆ రాష్ట్ర హైకోర్ట్ షోకాజ్ నోటీసులు

కెనరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మేలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. రుణం మొత్తంలో కొంత భాగాన్ని సంబంధిత కంపెనీలకు కమీషన్‌గా మళ్లించడం ద్వారా జెట్ ఎయిర్‌వేస్ బ్యాంకును రూ. 538.62 కోట్లను మోసం చేసిందని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. కంపెనీ ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఈ లావాదేవీలు మోసపూరితమైనవని, రుణ మొత్తం నుంచి నిధులను మళ్లించడంలో పాల్గొన్నట్లు వెల్లడైంది. సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో గోయల్‌పై మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనపై ఆరోపణలు చేసింది. ఈ ఏడాది మేలో గోయల్ నివాసం, కార్యాలయాలు సహా ముంబైలోని ఏడు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.

Also Read: Amit Shah: గిరిజనుల భూములపై కాంగ్రెస్‌ కన్ను పడింది

సంబంధిత కంపెనీలకు చెల్లించిన కమీషన్‌లుగా చూపబడిన జెట్ ఎయిర్‌వేస్ ఖర్చులలో కొంత భాగాన్ని వాస్తవానికి గోయల్ కుటుంబం, స్కామ్‌లో పాల్గొన్న ఇతర వ్యక్తుల వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. గోయల్, ఒక ప్రవాస భారతీయ వ్యాపారవేత్త, ఏప్రిల్ 1992లో జెట్ ఎయిర్‌వేస్‌ను స్థాపించారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎయిర్‌లైన్ 2019 ఏప్రిల్‌లో కార్యకలాపాలను నిలిపివేసింది. కంపెనీ ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉంది.

Exit mobile version