JD Laxminarayana: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది.. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ చెప్పారు. ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నా. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నాం. మా పార్టీ పెట్టిన పార్టీ కాదు.. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ చెప్పుకొచ్చిన ఆయన.. ఇక, అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం, వారికి మద్దతు తెలుపుతోన్న మరో పార్టీని.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఇలా.. ఎవ్వరినీ వదలకుండా విమర్శలు గుప్పించారు.
రాజకీయాలు కొన్ని కుటుంబాలకు పరిమితం అయ్యాయన్నారు వీవీ లక్ష్మీనారాయణ.. ఎవరో నాన్నగారు ఓ హోదాలో వాళ్ల పిల్లలకూ అదే హోదా ఉండాలా..? ఒకరు బ్లాక్ కమెండోల సెక్యూరిటీలో ఉంటే.. మరొకరు పరదాల సెక్యూరిటీలో ఉన్నారు.. కానీ ప్రజలకు సెక్యూరిటీ లేదన్నారు. అంగబలం, అర్ధబలం లేదు.. కానీ ప్రజల నైతిక బలం మాకుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఒకరు తప్పుతో అప్పు చేశారు.. మరొకరు తప్పుతో పెద్ద అప్పు చేస్తున్నారు.. ఇంకొకరు తప్పు చేసి అప్పు చేసిన వారికి పక్కన నిలబెడ్డారు అంటూ అన్ని పార్టీలను దుయ్యబట్టారు. మరోవైపు.. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదని మండిపడ్డారు జేడీ.. నిరుద్యోగం పెరగడానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణంగా పేర్కొన్న ఆయన.. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీయే ముద్దన్నారు కొందరు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఇంకొకరు.. కానీ మెడలు వంగలేదు.. హోదా రాలేదంటూ.. అధికార, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
అయితే, ప్రత్యేక హోదా తేవడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందని ప్రకటించారు జేడీ లక్ష్మీ నారాయణ.. మేం ఎవ్వరికీ తలవంచం.. సాగిలపడం. వాళ్లు తిన్నారని వీళ్లు.. వీళ్లూ తిన్నారని వాళ్లు అంటున్నారు. వాళ్లూ.. వీళ్లూ తిన్నారని సభల్లో ప్రకటించిన వాళ్లు మద్దతిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధితో అవసరాలు తీరుస్తాం. సరైన పాలసీలు లేకపోవడం వల్లే ఉపాధి లభించడం లేదన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగనిచ్చే పథకం మేం తెస్తాం. మేం ఓట్లు చీల్చం.. సీట్లు చీల్చి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అవకాశం పోయిందనే బాధ లేదు. ప్రభుత్వాలు ఐదేళ్లూ ఉండని పరిస్థితి.. ఎప్పుడు కూలుతాయో తెలియదన్నారు. నేను రాజకీయాల్లోకి దిగలేదు.. దూకాను అని చమత్కరించారు.. మేం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం.. నా కాళ్ల మీదే మేం ఎదుగుతామన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.